అప్పుడు ఏపీ, ఇప్పుడు తెలంగాణలో…

Hyderabad Real Estate Falling

ఇదివరకు ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని విషయంలో ఏర్పడిన సందిగ్దత, ఇసుక మాఫియా వలన రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయింది. అమరావతి రాజధానిగా అంగీకరించకపోగా నిర్మాణ పనులన్నీ నిలిపివేయడంతో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ రంగం చాలా నష్టపోయింది.

ADVERTISEMENT

చివరికి విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్‌ ప్రభుత్వం చెప్పినప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోలేదు. విశాఖలో రాజధాని ఏర్పాటుకి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా కాలక్షేపం చేయడం, ప్రభుత్వం మారితే మళ్ళీ అమరావతి రాజధానిగా ఉంటుందని అందరూ భావించడంతో విశాఖ, ఉత్తరాంధ్రా జిల్లాలలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించలేదు. తత్ఫలితంగా జగన్‌ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయింది.

ఊహించిన్నట్లే ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి సిద్దం అవుతుండటంతో మళ్ళీ రాజధాని పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకున్నాయి. రాజధాని విషయంలో పూర్తి స్పష్ఠత నీయడమే కాకుండా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగవంతం చేయడం, విశాఖ నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవడం, ఇసుక విధానం ప్రకటించి అమలుచేస్తుండటంతో ఉత్తరాంధ్రా జిల్లాలలో కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది.

అయితే జగన్‌ తెలివితక్కువ నిర్ణయాల వలన ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బ తింటున్నప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా దూసుకుపోతుండేది. ఆ ఊపులో హైదరాబాద్‌ శివారులోని కోకాపేట వద్ద భూములు వేలం వేయగా గరిష్టంగా ఒక ఎకరం రూ.105 కోట్లకు అమ్ముడుపోయింది!

అందుకే తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఆ డబ్బుతో ఆంద్రాలో మూడెకరాలు కొనవచ్చని మాజీ సిఎం కేసీఆర్‌ అనేవారు.

విశాఖ, విజయవాడ, గుంటూరు జిల్లాలలో 10-11 అంతస్తుల భవనాలు నిర్మించడానికి భవన నిర్మాణ సంస్థలు వెనుకంజవేస్తున్నప్పుడు, హైదరాబాద్‌లో ఏకంగా 64 అంతస్తుల భవన సముదాయాలు నిర్మాణాలు మొదలయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత తేడా ఉందో ఇది సూచిస్తోంది.

కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాతో ఇస్తున్న షాకులతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అయోమయంగా మారింది. అన్ని అనుమతులు తీసుకొని నిర్మించిన గేటడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలలో కొన్ని ఎఫ్‌టిఎల్ నిబందనలకు విరుద్దంగా బఫర్ బఫర్ జోన్‌ పరిధిలో ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఆనాడు జగన్‌ పాలనలో ఏపీలో రియల్ ఎస్టేట్ దెబ్బ తినగా, ఇప్పుడు హైడ్రా కారణంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అయోమయంగా మారింది. ఇప్పుడు ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోగా, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అయోమయంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ధోరణి, విధానాల వలన రియల్ ఎస్టేట్ రంగాలు ఇంతగా ప్రభావితం అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories