హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం మంగళగిరికి వచ్చి డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. వారిరువురూ సుమారు రెండు గంటలపాటు హైడ్రా ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, కూల్చివేతల వలన తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలు, రాజకీయ సమస్యలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ అధీనంలో హైడ్రా, దాని కమీషనర్ రంగనాథ్ పనిచేస్తున్నారు. కనుక అయన ఊరికే మంగళగిరి వచ్చి ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారనుకోలేము.
పవన్ కళ్యాణ్ అటవీశాఖ మంత్రిగా కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా అటవీభూములు, కొల్లేరు సరస్సు, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయి. కానీ వాటిని విడిపించుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా ఫలించడం లేదు.
కనుక ఈ విషయంలో హైడ్రా కమీషనర్ రంగనాథ్ సలహాలు, సూచనలు తీసుకునేందుకు డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆయనని తన కార్యాలయానికి ఆహ్వానించి ఉండవచ్చు. అవునా కాదా?అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.
కానీ హైడ్రా ఆక్రమణల తొలగింపుకి ప్రయత్నించిన ప్రతీసారి హైకోర్టు చేత మొట్టికాయలు తింటూనే ఉంది. హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూనే ఉంది.
కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అంటే హైడ్రా బుల్డోజర్లను మన ఇళ్ళ మీదకు ఆహ్వానించడమేనని బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఒకవేళ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే దానికి హైడ్రా కూడా ఓ కారణమే అవుతుంది.
కనుక ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రాని ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా వైసీపీ చేయబోయే దుష్ప్రచారం, కూటమి ప్రభుత్వంపై దాని ప్రభావం, పర్యవసనాలు ఏవిదంగా ఉంటాయో ఒకటి పదిసార్లు ఆలోచించడం చాలా అవసరం. లేకుంటే హైడ్రా వలన తెలంగాణ ప్రభుత్వం ఏవిదంగా విమర్శలు, ఆరోపణలు, సమస్యలు ఎదుర్కొంటోందో, ఏపీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.






