ఒక్క రాజధానికి అంతయితే… మూడు రాజధానులకి ఎంత?

If it is enough for one capital then how much for three capitalsఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా మూడు రాజధానులు ఉండాలనే విషయం బహుశః తెలంగాణ ప్రభుత్వానికి దానిని నడిపిస్తున్న వెర్రి నాగన్న సిఎం కేసీఆర్‌కి తెలిసినట్లు లేదు. అందుకే తనకు తోచినట్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుపోతూ అదే అభివృద్ధి అని మురిసిపోతున్నారు పాపం!

మనకి మూడు రాజధానులు రాలేదు కానీ వస్తేనా…… అభివృద్ధి అంటే ఏమిటో యావత్ ప్రపంచానికి చూపించి ఉండేవాళ్ళం. కనుక ఎప్పుడు మూడు రాజధానులు ఏర్పాటవుతాయనేది కాదు ముఖ్యం… అభివృద్ధి జరుగుతుందా లేదా అనేదే ముఖ్యం. ఓ 5-10-15 ఏళ్ళు లేటుగా అయినా అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం మాకుంది… అందుకే ముందుగా మూడు రాజధానులు సాధించుకొనేందుకు ఎంతో నిబద్దతతో ఉద్యమాలు చేసుకొంటున్నారు వైసీపీ నేతలు!

ADVERTISEMENT

అయితే ప్రజలకే అర్దం కావడం లేదు. అప్పటికీ… మూడంటే మూడూ కాదు… మూడన్నా పదన్నా రాజధాని ఒక్కటే… అది విశాఖపట్నమే… అని ధర్మాన మంత్రివర్యులు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెపుతున్నా ఈ జనాలకి ఎక్కడం లేదు. రాత్రికి రాత్రే జగనన్న ఎక్కడ మూడు రాజధానులు ఏర్పాటు చేసేస్తాడో అని బెంగపెట్టుకొంటూ మూడొద్దు ఒకటే చాలంటూ కాకుల్లా అరుస్తూ గోలగోల చేస్తున్నారు. అసలు వైసీపీ కాన్సెప్టే అర్దం చేసుకోలేని జనాలకి ఎంత చెప్పినా వేస్టే అని ధర్మాన మంత్రివర్యులు అసహనం వ్యక్తం చేస్తుంటారు కూడా.

అయితే ఏపీకి ఈ మూడు స్తంభాలటను సెట్ చేసి పెట్టిన కేసీఆర్‌ అదెంత రంజుగా సాగుతోందో పట్టించుకోకుండా ఉన్న ఒక్క రాజధానితోనే తెలంగాణలో అన్ని జిల్లాలలో ఎక్కడికక్కడ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, సమీకృత మార్కెట్లు, పార్కులు, ట్యాంక్ బండులు, కేబిల్ బ్రిడ్జిలు కట్టించేస్తున్నారు వెర్రి నాగన్న!

ఇక ఆయన కుమారుడు కేటీఆర్‌ ఎంత అమాయకుడు కాకపోతే హైదరాబాద్‌ నగరం అంతటా ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు కట్టించేసి నగర ప్రజలు గాలిలో తేలిపోయేలా చేస్తున్నారు?ఈరోజు గచ్చిబౌలి వద్ద అవుటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు భారీ ఫ్లైఓవర్లను ప్రారంభోత్సవం చేసేశారు. కనీసం ఏడాదికి రెండు మూడు ఫ్లైఓవర్లు కట్టకపోతే ఆయనకి నిద్రపట్టదట! ఏం చేస్తాం పాపం… ఆయనో వెర్రి నాగన్న.. కనీసం ఆంధ్రాలో రోడ్లని చూసైన నేర్చుకోలేకపోయారు.

ఒకప్పుడు ఏపీలో రోడ్లు కళ్ళకి స్పష్టంగా కనబడేవి. కానీ ఇప్పుడు వాటి అవశేషాలలో నీళ్ళు నిండటంతో కనబడటం లేదు కానీ ఎక్కడికక్కడ ఎంచక్కా కొలనులు ఏర్పడ్డాయి. వాటిలోనే బాతులు ఈదులాడుకొంటున్నాయి. ప్రజలకు నీళ్ళు అవసరమైతే వాటి నుంచే తోడుకొంటున్నారు. నీళ్ళలో ప్రయాణించే ఓడలని చూశాము కానీ బస్సులు, బైకులను చూడాలంటే ఏపీకి రావలసిందే!

అయితే ఈ క్రెడిట్‌ని వైసీపీ సొంతం చేసుకొనేందుకు ఆశపడకుండా ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన కొలనులే అని క్రెడిట్ ట్రాన్స్‌ఫర్‌ చేసేస్తోంది. అయితే టిడిపి కూడా దానికి ఆశపడకుండా సోషల్ మీడియాలోనే ‘రావాలి జగన్… కావాలి జగన్…’ అనే పాటని అటాచ్ చేసి మళ్ళీ ఆ క్రెడిట్‌ని వైసీపీకే అప్పగించేస్తోంది. అది వేరే సంగతి.

అయితే ఏపీలో అధికార, విపక్షాలన్నీ ఓ చిన్న లెక్క మరిచిపోతున్నాయి. ఒక్క రాజధాని ఉన్న తెలంగాణయే ఇంత అభివృద్ధి చెందితే మూడు రాజధానులతో ఏపీ మరింకెంత అభివృద్ధి చెందుతుందనే సింపుల్ లెక్క ఎవరూ కట్టలేకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ మరో 30 ఏళ్ళవరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని జగనన్నే పాలించాలని ఫిక్స్ అయిపోయారు కనుక ఆలోగా మూడు రాజధానులు ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని తెలంగాణని ఓడించేయడం పక్కా… గ్యారెంటీ! ఎప్పుడు వచ్చామనేది కాదు బులెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం అని మహేష్ బాబు ఊరికే అన్నాడా? అర్దం చేసుకోరూ!

ADVERTISEMENT
Latest Stories