jagan-warnings

ఏపీ రాజకీయాలు యావత్ దేశానికే స్పూర్తి అన్నట్లు సాగుతున్నాయి. జగన్‌ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రంలో ఎటువంటి నీచ రాజకీయాలు జరిగాయో అందరూ కళ్ళారా చూశారు. నేటికీ వైసీపి సోషల్ మీడియాలో చాలా జుగుప్సాకరంగా సిఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉంది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెడితే చంద్రబాబు నాయుడు పాలనలో భావ ప్రకటన స్వేచ్చని హరించి వేస్తున్నారని, ప్రశ్నించే గొంతులను నిర్ధాక్షిణ్యంగా అణగద్రొక్కేస్తున్నారంటూ జగన్‌, వైసీపి నేతలు గగ్గోలు పెడుతున్నారు.

Also Read – ప్రభుత్వాలు చేతులు కట్టేసుకునే పరిస్థితి దాపురించిందా?

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే ముఖ్యమంత్రిని రాక్షసుడు, విషనాగులా చిత్రీకరించడమా? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇళ్ళలో మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడమా?అంటే కాదనే అర్దమవుతోంది. కానీ అవునని జగన్‌ గట్టిగా వాదించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం ఇదేనని, ప్రశ్నించే గొంతులు ఇవే అని తన సోషల్ మీడియాని బలంగా సమర్ధించుకున్నారు. అంటే ఇటువంటి అవాంఛనీయ ధోరణులను జగన్‌ స్వయంగా సమర్ధిస్తున్నారన్న మాట!

Also Read – వైసీపీ కాపు నాయకులకు ఇది అలవాటేగా…!

ఇంతటితో ఆగకుండా అధికారం శాశ్వితం కాదని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలని, మళ్ళీ తాను అధికారంలోకి రాగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సప్తసముద్రాల అవతల దాక్కున్నా ఒక్కొక్కరినీ పట్టుకొనివచ్చి ప్రతీకారం తీర్చుకుంటానని జగన్‌ హెచ్చరిస్తున్నారు.

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా ప్రతీకార, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలకు, నరకం చూపారు. ఆ కారణంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్‌ తీరు మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Also Read – రెండూ సంక్రాంతి రిలీజ్ బొమ్మలే!

ఆనాడు ఆయనకు భయపడో లేదా అండ చూసుకునో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా చాలా నీచంగా ప్రవర్తించారు. కనుకనే టిడిపి ‘రెడ్ బుక్’ తెరవాల్సివచ్చిందని అందరికీ తెలుసు.

అయినప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు, ఓ పక్క పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారుల ఒత్తిళ్ళని భరిస్తూ జగన్, వైసీపి విషయంలో చాలా సంయమనం పాటిస్తుంటే జగన్‌ దానిని చాతకానితనంగా భావించి చెలరేగిపోతున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఎంత ఆవేశపరుడైన్నప్పటికీ అంతే సహనం కూడా ఉన్నవారని అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి కూడా సోషల్ మీడియాలో వైసీపి దుష్ప్రచారంతో సహనం కోల్పోయి రాష్ట్ర హోంమంత్రి, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని బహిరంగంగా అడిగారంటే వైసీపీ ఎంతగా బరితెగించిందో అర్దం చేసుకోవచ్చు.

ఓ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని మాత్రమే కాకుండా వారి కుటుంబాలలో మహిళలపట్ల కూడా అసభ్యంగా పోస్టులు పెడుతుంటే ఏ ప్రభుత్వామైనా ఉపేక్షిస్తుందా? అలాంటి పోస్టులు పెట్టడం తప్పుకాదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే ఇదే అని వాదిస్తున్న జగన్‌ని ఏమనుకోవాలి?

చివరిగా ఒక మాట: జగన్‌ జోలికి చంద్రబాబు నాయుడు, టిడిపి వెళ్ళకపోయినా అధికారంలోకి రాగానే వారిని వెంటబడి వేధించారు.

ఇప్పుడు జగన్‌, వైసీపిపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కనుక ఈసారి జగన్‌ అధికారంలోకి వస్తే మరెంత భయంకరంగా వ్యవహరిస్తారో టిడిపి, జనసేనలు కూడా ఊహించలేవు. కనుక జగన్‌ హెచ్చరికలను బుర్రలో ఉంచుకొని, మళ్ళీ ఆయనకు ఆ అవకాశం ఈయకుండా ఏవిదంగా ముందుకు సాగాలో ఆలోచించుకుంటే మంచిది.