3-0తో సిరీస్ లో వెనుకబడి ఉన్న ఇంగ్లాండ్ జట్టు, చివరి టెస్ట్ లోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలనే తలంపుతో బరిలోకి దిగి, తొలిరోజు విజయవంతంగా ముగించగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టును ఇషాంత్ శర్మ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జెన్నింగ్స్ ను (1) పరుగుకే అవుట్ చేయగా, మరోసారి జడేజా బౌలింగ్ కు కెప్టెన్ కుక్ (10) దొరికిపోయాడు. దీంతో 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును రూట్, మొయిన్ అలీ ఆదుకున్నారు.
తొలి సెషన్ వరకు చాలా నెమ్మదిగా కొనసాగించిన బ్యాటింగ్ ను రెండవ సెషన్ లో పరుగులు పెట్టించారు. ఆ క్రమంలో అర్ధ సెంచరీ ముగించుకుని, సెంచరీ దిశగా అడుగులు వేస్తున్న రూట్ ను జడేజా వెనక్కి పంపాడు. స్వీప్ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ పార్తీవ్ పటేల్ కు చిక్కిన రూట్ ను ఎంపైర్ అవుట్ గా ప్రకటించకపోవడంతో, రివ్యూకు వెళ్ళిన ఇండియాకు కలిసొచ్చింది. టీవీ రిప్లైలో బ్యాట్ ఎడ్జ్ ను బాల్ తాకిందని స్పష్టం కావడంతో రూట్ (88) నిరుత్సాహంతో వెనుదిరిగాడు.
ఆ తర్వాత మొయిన్ అలీకి జత కలిసిన బెయిర్ స్టో స్కోర్ బోర్డు ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో అలీ సెంచరీని పూర్తి చేసుకోగా, బెయిర్ స్టోను 49 పరుగుల వద్ద జడేజా పెవిలియన్ పంపాడు. 253 పరుగుల వద్ద 4వ వికెట్ ను కోల్పోయిన జట్టు, మరో వికెట్ కోల్పోకుండా మొయిన్ అలీ, స్టోక్స్ జాగ్రత్తపడ్డారు. ఆట ముగిసే సమయానికి అలీ 120, స్టోక్స్ 5 పరుగులతో నాటౌట్ గా నిలువగా, ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది.



