అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత భారత్‌పై విధించిన సుంకాలు 25 నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయనని ప్రధాని మోడీ హామీ ఇచ్చినందున 25 శాతం సుంకాలు కూడా పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వెనిజులా నుంచి భారత్‌కు చమురు సరఫరా చేస్తామని చెప్పారు.
ఇందుకు ప్రతిగా 500 బిలియన్ డాలర్లు విలువగల అమెరికా సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ, ఇంధన, బొగ్గు ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు ప్రధాని మోడీ అంగీకరించారని చెప్పారు.
భారత్ కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పూర్తిగా తగ్గిస్తూ ‘సున్నా’ స్థాయికి తీసుకు వస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని ట్రంప్ అన్నారు.
భారత్-అమెరికా మద్య జరిగిన ఈ వాణిజ్య యుద్ధంలో చివరికి ఎవరు గెలిచారు?అంటే అమెరికాయే అని అర్ధమవుతూనే ఉంది.
కానీ ఇద్దరు దేశాధినేతల పంతాలు,పట్టుదల, ఇగో వలన ఈ ఆరు నెలల్లో రెండు దేశాలు లక్షల కోట్లు నష్టపోయాయి కదా?ముఖ్యంగా వాణిజ్యం, షేర్ మార్కెట్లలో భారత్‌కు లక్షల కోట్లు నష్టం కలిగింది.
కనీసం కేంద్ర బడ్జెట్‌కు ముందు ఈ ప్రకటన వెలువడినా షేర్ మార్కెట్లో భారతీయుల లక్షల కోట్లు కష్టార్జితం ఆవిరి కాకుండా కాపాడగలిగేవారు కదా?
ట్రంప్ సుంకాల దెబ్బలతో భారత్ గుణపాఠాలు నేర్చుకుంటుందని అమెరికాతో సహా విదేశాలపై విపరీతంగా ఆధారపడటం తగ్గించుకొని స్వయంసంవృద్ది సాధించే దిశలో అడుగులు వేస్తుందని అనుకుంటే, ఆరేడు నెలల్లో లక్షల కోట్లు ఆవిరి చేసుకొని చివరికి ట్రంప్‌కి దాసోహం అనడం చాలా శోచనీయం.
అమెరికా ఒత్తిళ్ళని తట్టుకోవడం మన వల్ల కానప్పుడు ఈ పంతాలు, పట్టింపులు దేనికి?ప్రధాని మోడీ ఇంత బెట్టు చేసినా చివరికి ట్రంప్‌కి దాసోహం అనక తప్పలేదు కదా? అప్పుడే దాసోహమైతే భారత్‌కు ఇంత నష్టం జరిగి ఉండేది కాదు కదా?
ఇప్పటికే చైనా ఉత్పత్తులతో దేశీయ పరిశ్రమలు దివాళా తీశాయి. ఈ కారణంగా లక్షలాది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇకపై భారత్‌ని ముంచెత్తబోయే అమెరికా వ్యవసాయోత్పత్తులు, పాల ఉత్పత్తులు దేశంలో వ్యవసాయ, పాడి రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేయక మానవు.
అలాగే భారత్‌లో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉండగా అమెరికా నుంచి భారత్ బొగ్గు దిగుమతి చేసుకుంటే ఆ భారం విద్యుత్ ఉత్పత్తిపై పడుతుంది. అప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరిగితే సామాన్య ప్రజల ఆ భారం పడుతుంది. అమెరికా నుంచి బొగ్గు దిగుమతి మొదలైతే దేశీయ బొగ్గు ఉత్పత్తి సంస్థల పరిస్థితి ఏమవుతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఈ ఆరు నెలల్లో జరిగిన వాణిజ్య యుద్ధం వలన జరిగిన అపార నష్టం ఒక ఎత్తు అయితే, ఇకపై అమెరికా దిగుమతులతో జరుగబోయే నష్టం మరో ఎత్తు. వాణిజ్య సుంకాల నష్టం ఆరేడు నెలలకు పరిమితం కాగా, అమెరికా దిగుమతులతో శాశ్వితంగా నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది.






