ప్రపంచానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) సాంకేతిక పరిజ్ఞానం అందివచ్చిన ఈ సమయంలోనే అటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల చాలా ఆశక్తి ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి కలిసివస్తోంది.
దేశంలో మొట్ట మొదటి ఏఐ యూనివర్సిటీణి అమరావతిలో స్థాపించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు చకచకా పావులు కదుపుతున్నారు.
అయితే దీనికి ఇప్పుడు కాదు.. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, అక్టోబరులో ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ ముంబయి వెళ్ళి ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుమోసిన ఎన్విడియా కంపెనీ సీఈవో జెన్సన్ హువాంగ్‌తో భేటీ అయ్యారు.
అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఏఐ సాఫ్ట్‌వేర్ అందించి, ఏఐలో శిక్షణ, ప్రాజెక్ట్ వర్కులు, పరిశోధన, మార్కెటింగ్, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరగా జెన్సన్ హువాంగ్ సానుకూలంగా స్పందించారు.
శుక్రవారం సిఎం చంద్రబాబు నాయుడు నివాసంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎన్విడియా కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఎన్విడియా కంపెనీ తరపున దక్షిణాసియా ఎండీ విశాల్ దూపర్, ఆ సంస్థ బిజినెస్ స్ట్రాటజీ డైరెక్టర్ గణేష్ మహాబాల తదితరులు, ప్రభుత్వం తరపున విద్యాశాఖ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి, కళాశాల విద్యా డైరెక్టర్ భరత్ గుప్తా సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం ఎన్విడియా కంపెనీ రాష్ట్రంలో 10,000 మంది విద్యార్ధులకు ఏఐలో శిక్షణ ఇస్తుంది. రాష్ట్రంలో 500 ఏఐ స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు, అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది.




