వైసీపీ లో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి అతిథి పాత్రలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. పార్టీ ఓటమి నుంచి నేటి వరకు జగన్ ఏపీని విడిది ఇల్లు మాదిరి చేసుకుని బెంగళూర్ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారు.
ఇక పార్టీలోని ముఖ్య నాయకుల విషయానికొస్తే వారిలో కొందరు అజ్ఞాతంలో జీవిస్తుంటే మరికొందరు శ్రీ కృష్ణ జన్మస్థానంలో సేద తీరుతున్నారు. అయితే వారి పరామర్శలకో, ఓదార్పులకో జగన్ అతిథి పాత్రలో రాష్ట్రానికి వచ్చి పోతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో నిత్యం మీడియాలో బూతుల అష్టోత్తరం వినిపించిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇప్పుడు కనీసం మీడియాకు ముఖం చూపలేని నిస్సహాయ స్థితిలో అజ్ఞాతంలో బతుకుతున్నారు.
అలాగే ఇక ఇదే కోవలో వల్లభనేని వంశీ, పోసాని, ద్వారం పూడి, గ్రంథి శ్రీనివాస్, పెద్దా రెడ్డి, సజ్జల వంటి అనేకమంది వైసీపీ కీలక నాయకులు ఇప్పుడు కలుగులో దాక్కుంటున్నారు.
ఇలా అజ్ఞాత జీవితం గడుపుతూ కొంతమంది కళ్ళు మూసుకుంటే ఇంకొంతమంది లిక్కర్ స్కాం లో అరెస్టయ్యి, నకిలీ మద్యం కుంభకోణంలో పట్టుబడి, మరికొందరు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి అంశంలో విచారణ ఎదుర్కొంటు అరెస్టులతో జైళ్ల చుట్టూ, బైళ్ల కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
ఇక ఈ లిస్టులో తమ పేరు జోడించేందుకు వైసీపీ నుంచి మరికొంతమంది నాయకులు ఇప్పుడు క్యూ లో నిలబడుతున్నారు. వారిలో తిరుమల పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు భూమన, వైవి సుబ్బారెడ్డి అధికారుల ముందు విచారణకు వస్తున్నారు.
ఇలా వైసీపీ లో అధినేత అతిధి పాత్రలో, నాయకులు అజ్ఞాతంలో ఉంటే క్యాడర్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సీఎం సీఎం అనే నినాదాలతో రప్ప రప్ప రాజకీయం అంటూ ఇప్పటి నుంచే ఏపీ ఓటర్లను భయపెట్టే పనిలో పడ్డారు.
ఈ విధంగా వైసీపీ లో ఎవరికీ వారే యమునా తీరే అన్న చందంగా రాజకీయాలు చేస్తూ ఎవరి దారి వారిదే అన్నట్టుగా నడుచుకుంటున్నారు. మరి ఆ రాజకీయాన్ని చూస్తున్న ప్రజలు వైసీపీ దారిలో వెళ్ళడానికి సిద్ధమవుతారా.? లేక మరోసారి వైసీపీ నే తమ దారిలోకి తెచ్చుకునేందుకు పంతం పడతారా .?






