ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో చెత్త బ్యాట్స్ మెన్ ఎవరూ అంటే… దానికి టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు టాప్ ఆటగాళ్ళు పోటీపడుతున్నారు. ఒకరు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కాగా, మరొకరు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఇప్పటివరకు చెరో నాలుగు మ్యాచ్ లు ఆడిన వీరిద్దరూ ఎంత అధ్వానంగా బ్యాటింగ్ చేయాలో, అంత అధ్వానంగా చేసారని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
నిజానికి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకున్నా, లేకున్నా వీరిద్దరిపై నమ్మకముండేది. కానీ, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే… జట్టు కష్టాలకు వీరిద్దరే కారణంగా మారుతున్నారు. వీరి బ్యాట్ నుండి కనీసం ఒక్క షాట్ చూద్దామన్నా కూడా అవకాశం ఇవ్వకుండా అత్యంత చెత్త ప్రదర్శనలు కనపరుస్తున్నారు. రోహిత్ శర్మ ఓపెనర్ గా దిగి విఫలమవుతుండగా, ధోని మిడిల్ ఆర్డర్ లో దిగి అదే వైఫల్యాలను ప్రదర్శిస్తున్నారు.
అయితే ఈ ఇద్దరిలో కూడా రోహిత్ శర్మ ఆటతీరు అత్యంత ఘోరంగా ఉందని చెప్పవచ్చు. ఆడిన నాలుగు మ్యాచ్ లలో కూడా ఒకే రకమైన బంతికి అవుట్ కావడం రోహిత్ శర్మ స్పెషాలిటీగా మారింది. నాలుగు సార్లు లెగ్ స్పిన్నర్ వేసిన ‘గూగ్లీ’కి రోహిత్ శర్మ పెవిలియన్ పడుతుండడంతో, ఇక రాబోతున్న మ్యాచ్ లలో కూడా ‘ఇలా బౌలింగ్ వేసుకోండి… నన్ను అవుట్ చేసుకోండి…’ అన్న బంపర్ ఆఫర్ ను ప్రకటించినట్లుగా కనపడుతోంది.
ఇక, ధోని పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. ఎలాంటి సమయంలో ఎలా ఆడాలో అన్న మెళుకువ ధోనికి తెలిసినంతగా మరొకరికి తెలియదని చెప్పవచ్చు. నాలుగు మ్యాచ్ లలో కూడా వివిధ సందర్భాలలో ధోనికి అవకాశాలు రాగా, ఓ ఒక్క సందర్భంలోనూ తన స్థాయికి తగిన ప్రతిభ చూపించలేకపోయారు. పూణే విజయం సాధించిన తొలి మ్యాచ్ లో కూడా ధోని బ్యాటింగ్ తో వీక్షకులు అసంతృప్తి వ్యక్తం చేసారు.
నాలుగు మ్యాచ్ లలో కలిపి ధోని 33 పరుగులు చేసి రెండెంకల స్కోర్ ను దాటగా, రోహిత్ శర్మ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 4 మ్యాచ్ లలో కేవలం 9 పరుగులు చేసి, కనీసం రెండెంకల స్కోర్ ను కూడా చేరుకోలేక పోవడం, రోహిత్ అభిమానులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధోని స్థానం 44 కాగా, రోహిత్ శర్మది 60వ స్థానం. దీనినే బట్టే వీరి ఏ స్థాయిలో ఆడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. బహుశా ఈ ఏడాది ఐపీఎల్ నుండి ‘చెత్త బ్యాట్స్ మెన్’ అవార్డును కూడా ప్రవేశపెట్టాలనే విధంగా, వీరిద్దరూ బ్యాటింగ్ విభాగంలో పోటీపడతారేమో చూడాలి.



