
అనుభవం లేని నాయకత్వం అవసరం లేని వివాదాలను సృష్టిస్తుంది అనేలా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వైస్ జగన్ మోహన్ రెడ్డి నిరూపించి చూపించారు. ఇప్పుడు అదే అనుభవరాహిత్యంతో రేవంత్ రెడ్డి తప్పటడుగులు వేస్తున్నారా అనిపిస్తుంది.
అవసరం లేని మార్పులు, మూర్కత్వపు విధానాలు, ముందాలోచన లేని వ్యూహాలు, తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన వివాదాలు…ఇలా గత ఐదేళ్లు ఏపీలో రాజకీయ, ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిచారు వైస్ జగన్.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ ప్రభుత్వం, మూడు రాజధానుల పేరుతో ఒకసారి, విశాఖే రాజధాని అంటూ మరోసారి, ఎన్టీఆర్ యూనివర్సిటీ గా ఉన్న విద్యాసంస్థకు వైస్సార్ యూనివర్సిటీ గా పేరు మార్పు చేసి మరోమారు, అలాగే కృష్ణా నది తీరప్రాంతమున్న నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా, ఎన్టీఆర్ పుట్టి పెరిగిన జిల్లాను కృష్ణ జిల్లాగా ఇలా అర్ధం పర్ధం లేని మార్పులతో వైస్ జగన్ లేనిపోని విదాలలో చిక్కుకుని చివరికి ఫలితాన్ని అనుభవిస్తున్నారు.
ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి గా అధికారాన్ని అనుభవిస్తున్న రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహా రాజకీయంతో వివాదాలను చవి చూస్తున్నారు. హైడ్రా అంటూ అక్రమ నిర్మాణాల కూల్చివేతతో పేద, మధ్య తరగతి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు రేవంత్. మూసి ప్రక్షాళన అంటూ ముందుకొచ్చిన హైడ్రాకు స్థానిక ప్రజలు తమ నిరసనతో బ్రేకులు వేశారు.
Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!
బడా వ్యాపార వేత్తల, ప్రముఖ రాజకీయ నేతల నిర్మాణాలకు లేని నింబంధనలు తమకేనా అంటూ హైద్రాబాద్ వాసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. దీనితో హైడ్రా నిర్ణయం రేవంత్ అనాలోచిత చర్యగా భావించారు రాజకీయ విశ్లేషకులు. అలాగే అటు సినీ పరిశ్రమ మీద, సినీ రంగ ప్రముఖుల పట్ల కూడా జగన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒక్క తీరుగానే నడుచుకున్నారు అనేలా వారి విధానాలు స్పష్టం చేసాయి.
ఇక తాజాగా నేడు తెలంగాణ అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి ప్రకటించిన పొట్టి శ్రీరాములు పేరు మార్పు నిర్ణయం ఆయన పాలనను జగన్ రెడ్డి ప్రభుత్వంతో పోల్చి చూస్తున్నారు తెలుగు ప్రజలు. ఇన్నాళ్ళుగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ గా ఉన్నపేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించింది.
Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?
భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం సుమారు 52 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచిన మహోన్నత వ్యక్తి పేరును మారుస్తూ రేవంత్ ఈ నిర్ణయం తీసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేర్పాటు విధానాలతో తెలంగాణ సమాజాన్ని కోలుకోనీయకుండా ఇలా రాజకీయ నేతలు ఆయా పార్టీల ప్రభుత్వాలు మహనీయుల పేర్లు మార్చి తమ ఉనికి చాటుకోవాలనుకోవడం వారి అవివేకమే అవుతుంది.
పేరు మార్చినంత మాత్రాన చరిత్రను మార్చలేము, వారి త్యాగాలను చెరపలేరు. అలాగే రాజకీయ, సాంఘిక చైతన్యకారుడైన మహా నేత సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టడానికి మరో గొప్ప వ్యక్తి పేరు మార్చాల్సిన అవసరం ఏముంది.? తెలంగాణలో కొత్తగా నిర్మించే అనేక నిర్మాణాలలో ప్రముఖమైన వాటిలో ఒకదానికి ఆయన పేరు పెట్టుకుని ఆయన పై తమకున్న గౌరవాన్ని చాటుకోవచ్చు. కానీ ఇలా పొట్టి శ్రీరాముల పేరు తొలగించి చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ఆయన పేరు పెట్టాలని ప్రతిపాదిస్తున్నట్టు ప్రకటించారు రేవంత్.
ఆ దిశగా పొట్టిశ్రీరాములు పేరును పెట్టేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు, కిషన్ రెడ్డి కి లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు. అయితే పాలనా పరమైన సమస్యలు తలెత్తుతాయనే కారణంగా ఉన్న పేరును తొలగించి ఇప్పుడు కొత్తగా నిర్మించే భవనాలకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని రేవంత్ బీజేపీ నేతలను డిమాండ్ చేయడం వెనుక ఉన్న ఆ రాజకీయ ఆంతర్యమేమిటో.?
ఇదిలా ఉంటే పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగానికి గుర్తింపు, గౌరవంగా ఆయన భారీ విగ్రహాన్ని ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించిన వేళ ఇలా తెలంగాణలో ఆయన పేరు మార్చడం తెలుగు వారికీ ఆవేదన కలిగించే అంశమవుతుంది. అయితే నాడు వైస్ జగన్ రెడ్డి కానీ, నేడు రేవంత్ రెడ్డి కానీ తమ అనుభవరాహిత్యంతోనే ఇలా అనవసర మార్పులకు శ్రీకారం చుట్టి లేనిపోని వివాదాలను సృష్టించుకుంటున్నారు అనే ఆవేదన బలంగా వినిపిస్తుంది.