టీడీపి మౌనమే బీఆర్ఎస్‌ పార్టీకి శాపం కానుందా?

TDP Silence BRS Threat

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, బనకచర్ల ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి…. అని అనడం కంటే బీఆర్ఎస్‌ పార్టీ తిప్పుతోందని చెప్పుకోవచ్చు. ఎందుకో కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్వయంగా చెప్పేశారు.

కాంగ్రెస్‌, బీజేపి, చంద్రబాబు నాయుడు మూడు దిశల నుంచి తెలంగాణను కబళించాలని కుట్రలు చేస్తున్నారని వారి వలన తెలంగాణ రాష్ట్రానికి (అంటే బీఆర్ఎస్‌ పార్టీకి అంటే కేసీఆర్‌కి అంటే తన రాజకీయ భవిష్యత్తు) ప్రమాదం ఏర్పడింది. కనుక బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఉద్యమించాలని కేటీఆర్‌ చెప్పారనుకోవచ్చు.

ADVERTISEMENT

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి కోవర్టు అని, ఆయన చెప్పినట్లుగా కృష్ణా, గోదావరి నీళ్ళు ఏపీకి పారించేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు.

నాలుగు రోజుల క్రితమే “నారా లోకేష్‌ నా తమ్ముడు… మా మద్య మంచి స్నేహం ఉందని” కేటీఆర్‌ స్వయంగా చెప్పారు.

నారా లోకేష్‌ని తమ్ముడుగా భావిస్తున్నప్పుడు, ఆయన తండ్రి సిఎం చంద్రబాబు నాయుడుని కేటీఆర్‌ అంతలేసి మాటలు ఎలా అనగలుగుతున్నారు?

‘తమ్ముడూ…’ అన్న నోటితోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటిని దోచుకుపోతున్న దొంగ అంటూ నీచంగా మాట్లాడుతున్నప్పుడు, ‘తమ్ముడు’ నారా లోకేష్‌ ఎందుకు స్పందించడం లేదు?

అదే… జగన్‌ లేదా వైసీపీ నేతలు ఒక్క మాట అంటే వారితో కలబడిపోయే ఏపీ మంత్రులు, ఏపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు, టీడీపి నేతల మౌనానికి కారణం ఏమిటి?అనే సందేహం కలుగుతుంది. వారెవరూ నోరు విప్పడం లేదు కనుక ఈ ప్రశ్నలకు జవాబులు కూడా మనమే వెతుక్కోవలసి ఉంటుంది.

ఆనాడు చంద్రబాబు నాయుడుని జగన్‌ జైల్లో పెట్టినప్పుడు ఆయన గురించి కేటీఆర్‌ చాలా చులకనగా మాట్లాడారు. ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోవడానికీ అదీ ఓ కారణమని అందరికీ తెలుసు.

కనుక చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తూ చాలా తెలివిగా తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నాననుకుంటున్న కేటీఆర్‌ని అదే భ్రమలో కొనసాగానీయడమే మంచిదని టీడీపి భావిస్తుండవచ్చు.

తనకంటే వయసులో, అనుభవంలో, జ్ఞానంలో, పలుకుబడిలో, పదవులలో చాలా పెద్దవారైన సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి కేటీఆర్‌ ఇలాగే అహంభావంతో మాట్లాడనిస్తుండటమే మంచిదని, త్వరలో జరుగబోయే గ్రేటర్ హైదరాబాద్‌, స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీకి ఈ మాటలే శాపంగా మారుతాయని టీడీపి నేతలు భావిస్తున్నారేమో?

మంత్రి నారా లోకేష్‌, టీడీపి నేతలు కేటీఆర్‌ మాటకి మాట జవాబు చెప్పగలరనే విషయం అందరికీ తెలుసు. కానీ వారు స్పందించకుండా మౌనంగా ఉంటేనే కేటీఆర్‌ ఇంత రాజకీయాలు చేస్తున్నారు. ఒకవేళ స్పందించి కేటీఆర్‌తో యుద్ధం మొదలుపెడితే ‘తెలంగాణ సెంటిమెంట్’ రాజేసుకోవడానికి ఆయనకి తోడ్పడుతున్నట్లే అవుతుందని టీడీపి నేతలకు తెలుసు.

బహుశః అందువల్లే సిఎం చంద్రబాబు నాయుడుని కేటీఆర్‌ అంతలేసి మాటలు అంటున్నా నారా లోకేష్‌తో సహా టీడీపి నేతలందరూ మౌనంగా ఉండిపోతున్నట్లు భావించవచ్చు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు టీడీపిని దూరంగా ఉంచడం ద్వారా బీఆర్ఎస్‌ పార్టీకి మరిచిపోలేని ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చిన సిఎం చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం ద్వారా గ్రేటర్, స్థానిక సంస్థల ఎన్నికలలో మరోసారి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలనుకుంటున్నారేమో?

సిఎం చంద్రబాబు నాయుడు రాజకీయంగా భూస్థాపితం చేసేయాలని కేసీఆర్‌, జగన్‌ చాలా ప్రయత్నించారు. కానీ వారి ద్వేషం, వారి అహంభావమే చంద్రబాబు నాయుడుకి ఎంతగానో తోడ్పడిందని అందరికీ తెలుసు.

తన గురించి కేటీఆర్‌, జగన్‌ ఎంత నీచంగా మాట్లాడుతున్నా సిఎం చంద్రబాబు నాయుడు ఒక్క మాట మాట్లాడకుండా వీలు వెంబడి ‘రిటర్న్ గిఫ్ట్స్’ ఇచ్చేస్తూనే ఉన్నారు.

కనుక కేసీఆర్‌ మౌనం కంటే సిఎం చంద్రబాబు నాయుడు మౌనమే చాలా ప్రమాదకరమని భావించవచ్చు. 

ADVERTISEMENT
Latest Stories