ఏపీలో వైసీపి, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పతనానికి ఒకటి కాదు వంద కారణాలు చెప్పుకోవచ్చు. వాటిని జగన్, కేసీఆర్ అంగీకరించకపోయినా అవి వాస్తవాలే అని అందరికీ తెలుసు. కేసీఆర్ విషయానికి వస్తే ఓటుకి నోటు కేసు కూడా వాటిలో ఒకటని చెప్పక తప్పదు.
ఆయన చాలా తెలివిగా ఒకేసారి రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని ట్రాప్ చేసి, ఇద్దరినీ అప్రదిష్టపాలు చేసి రాజకీయంగా దెబ్బ తీయాలనుకున్నారు. కొంత వరకు ఆయన ప్రయత్నం ఫలించింది కూడా. ఆ కేసుతో కేసీఆర్ ఎంతగా పాపులర్ అయ్యారో, వారిరువురూ కూడా అంతగా అప్రదిష్టపాలయ్యారు.
అయితే ఆ కేసుతో ఆయన వారి పరువు తీయగలిగారు కానీ మరేమీ చేయలేకపోయారు. కానీ ఆ కేసు కారణంగానే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అనే ఇద్దరు బలమైన శత్రువులను సృష్టించుకున్నారు.
ఆనాడు రేవంత్ రెడ్డిని జైలుకి పంపించి, కూతురు పెళ్ళి చేస్తున్నప్పుడు కేసీఆర్ చాలా ఇబ్బందిపెట్టారు. అప్పుడే రేవంత్ రెడ్డి శపధం చేశారు. ఏనాటికైనా కేసీఆర్‌ని ఓడించి అదే జైలులో చిప్పకూడు తినిపిస్తానని శపధం చేశారు. చెప్పిన్నట్లుగానే ఎన్నికలలో ఓడించారు.
శపధం పూర్తి చేసేందుకు అనేక కేసులు సిద్దం చేస్తున్నారు. వాటిలో ఏదో ఓ కేసులో తనని జైలుకి పంపించకుండా ఉండరని బహుశః కేసీఆర్ కూడా గ్రహించే ఉంటారు.
ఇక ఆ కేసులో చంద్రబాబు నాయుడుని కూడా జైల్లో పెట్టేందుకు కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేశారు కానీ ఫలించలేదు.
ఓటుకి నోటు కేసుతో వారిని భలే దెబ్బ తీశానని కేసీఆర్ పొంగిపోయారు కానీ అప్పటి నుంచే కేసీఆర్ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారనే విషయం బయటపెట్టడంతో కేసీఆర్ వెనక్కు తగ్గక తప్పలేదు. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులే కేసీఆర్ మెడకు చుట్టుకోబోతున్నాయి.
ఆనాడు తమ పరువు తీసి, రాజకీయంగా దెబ్బతీశానని కేసీఆర్ మిడిసిపడుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం తొందరపడి నోరు జారలేదు. కేసీఆర్ జోలికి పోలేదు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ అవకాశం రాబోతోందని గుర్తించారు. కానీ తొందరపడలేదు.
ఈలోగా కేసీఆర్ మరోసారి 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బతీశారు. చివరికి 2023 శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరికీ ఆ అవకాశం వచ్చింది. ఆ ఎన్నికలకు టిడిపి దూరంగా ఉండిపోయి రేవంత్ రెడ్డికి పరోక్షంగా సాయపడ్డారు.
రేవంత్ రెడ్డి కూడా సర్వశక్తులు ఒడ్డి పోరాడి కేసీఆర్‌ని ఓడించి మూల కూర్చోపెట్టారు. ఆనాడు కేసీఆర్ వారిద్దరినీ ట్రాప్ చేసి రాజకీయంగా చావు దెబ్బ తీయాలని ప్రయత్నించకపోయి ఉంటే బహుశః కేసీఆర్‌ని ఓడించాలని వారిద్దరూ పట్టుబట్టి ఉండేవారు కారు.
కానీ కేసీఆర్ అందరి కంటే తాను గొప్ప రాజకీయ మేధావినని, అపర చాణక్యుడినని నిరూపించుకునేందుకు చేసిన ఆ ప్రయత్నమే ఆయన పతనానికి ఓ కారణం అయ్యింది.




