పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని హైదరాబాద్‌లో ప్రకటించి ఏర్పాటు చేసినప్పటికీ ఆంధ్రాలోనే రాజకీయాలు చేశారు. ఎదురుదెబ్బలు తిన్నారు. భరించి పోరాడారు. గెలిచారు. తాను గెలిచి తనని నమ్ముకున్నవారందరినీ గెలిపించారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన ఎంతగా శ్రమించారో, ఎన్ని త్యాగాలు చేశారో అందరికీ తెలుసు.
పవన్ కళ్యాణ్‌కి తెలంగాణ అంతటా అభిమానులున్నారు. కానీ ఏపీలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విజయం సాధించిన జనసేన తెలంగాణలో మాత్రం పరాజయం పాలయ్యింది. ఎందువల్ల? అంటే కాస్త లోతుగా ఆలోచించాలి.
బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేదా మరో పెద్ద హీరోని ‘వ్యతిరేకించేవారు’ రెండు రాష్ట్రాలలో చాలా మందే ఉన్నారు. అయితే ఏపీలో వారి వ్యతిరేకులు వారిని చూసే విధానం వేరు. తెలంగాణలో వ్యతిరేకించేవారు వారిని చూసే విధానం వేరు.
కేసీఆర్ బ్యాచ్ పుణ్యామాని ‘తెలుగుతల్లి’ వద్దనుకున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనవాడు కాదనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ సెంటిమెంట్‌ని బలంగా ఉంచుకుంటోంది. కనుక పవన్ కళ్యాణ్ మొహం చూసి అక్కడి ప్రజలు జనసేనని గెలిపిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. 2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన 8 స్థానాలలో జనసేన ఓడిపోవడమే ఇందుకు నిదర్శనం.
కానీ గత నెలలో జరిగిన పంచాయితీ ఎన్నికలలో జనసేన పార్టీ సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో కొన్ని సీట్లు గెలుచుకొని తెలంగాణలో బోణి కొట్టింది. అవి చాలా తక్కువే కావచ్చు కానీ ఆ చిన్న గెలుపు తమ సుదీర్గ ప్రయానికి తొలి అడుగు అనే నమ్మకం జనసేనకు కలిగినట్లుంది.
అందువల్లే తెలంగాణలో త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో జనసేన (బలంగా ఉన్న స్థానాలలో మాత్రమే) పోటీ చేయలని నిశ్చయించుకుంది. కానీ ఈ ఆలోచన బయట పెట్టగానే “జనసేనతో పొత్తు, మద్దతు రెండూ మాకు అవసరం లేదని “తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు ఖరాఖండీగా చెప్పేశారు. కనుక తెలంగాణలో జనసేన ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు జనసేన ఏపీలో స్థిరపడింది. కనుక పవన్ కళ్యాణ్‌లో, పార్టీలో ఆత్మవిశ్వాసం పెరగడం సహజం. తెలంగాణ చిన్న విజయం వారిని అటువైపు చూసేలా చేసిందని చెప్పొచ్చు.
కానీ జనసేన తెలంగాణలో ఎదురుదెబ్బలు తింటూ విస్తరణ కోసం సమయం వృధా చేసుకోవడం కంటే, ఆంధ్రాలో పార్టీ పునాదులు బలపరుచుకోవడం వివేకమనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ మారుమూల గిరిజన ప్రాంతాలకు చేస్తున్న సేవలకు గాను ఇప్పుడు ఏపీలో జనసేనకు అత్యంత అనుకూల పరిస్థితి నెలకొంది. అత్యంత ప్రజాధరణ పొందుతున్న ఈ సమయాన్ని జనసేన తెలివిగా ఉపయోగించుకొని ఏపీలోనే పార్టీని విస్తరించి బలోపేతం చేసుకుంటే చాల మంచిది.
ముఖ్యంగా ‘రప్పారప్పా’ భయాలు వెంటాడుతున్నప్పుడు, కేసీఆర్‌లా దూరపు కొండలు నునుపనుకొని పవన్ కళ్యాణ్ అటూ ఇటూ పరుగులు తీయడం చాలా ప్రమాదకరం. కనుక మిగిలిన ఈ మూడేళ్ళలోనే ఏపీలో ‘పాతుకుపోయేందుకు’ జనసేన గట్టిగా ప్రయత్నించడం చాలా అవసరం. లేకుంటే కేసీఆర్‌లా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేయాల్సి వస్తుందని మరిచిపోకూడదు.






