ఇప్పుడు రాష్ట్రంలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, మీడియా, ప్రజలు అందరూ కల్తీనెయ్యిలో మునిగి తేలుతున్నారు. తర్వాత జగన్ పరామర్శయాత్రల గురించే మాట్లాడుకుంటున్నారు.
అందరూ మెడికల్ కాలేజీల గురించే మాట్లాడుకోవాలని జగన్ అనుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు కల్తీ నెయ్యి టాపిక్ ఇచ్చారు. కనుక అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మరో విధంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాలను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైజాక్ చేసి తన నియంత్రణలో ఉంచుకున్నారని చెప్పవచ్చు.
అమరావతి నిర్మాణ పనులు, పరిశ్రమలు, పెట్టుబడులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల గురించి మాట్లాడుకోవాల్సిన ఈ సమయంలో అందరూ జగన్ ఇచ్చిన అజెండా గురించే మాట్లాడుకుంటున్నారంటే, రాజకీయంగా ఎవరు పైచేయి సాధించినట్లు?ఎవరు ఎవరి వలలో చిక్కుకున్నట్లు?కూటమి ప్రభుత్వమే ఆలోచించుకోవాలి.
సిఎం చంద్రబాబు నాయుడుకి లేనిది… జగన్‌కి ఉన్నది ఒకటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కనుక ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. అనేక పనులు చక్కబెడుతుండాలి. కానీ జగన్‌కి కావాల్సినంత తీరిక, సమయం ఉంది. కనుక తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని తాపీగా ఇలాంటి అజెండా తయారుచేసుకోగలరు. పక్కా ప్రణాళిక ప్రకారం అమలు చేయించగలుగుతున్నారు.
కనుక ఆయన వరస పెట్టి ఇస్తున్న ఈ డైలీ టాస్కులను వైసీపీ శ్రేణులు పక్కాగా అమలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వారిని ఫాలో కాక తప్పడం లేదు.
దీనికి మూడు పరిష్కారాలు కనిపిస్తున్నాయి. 1. జగన్ ఏవిధంగా కూటమి ప్రభుత్వానికి డైలీ టాస్కులు ఇస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆయనకు డైలీ టాస్కులు ఇస్తూ బిజీగా ఉంచాలి. 2. అయితే ప్రభుత్వంలో ఎవరికీ అంత సమయం, తీరిక ఉండవు. కనుక జగన్ కోసమే ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖ (టీమ్) ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 3. లేకుంటే సింపుల్‌గా జగన్ అజెండా ఫాలో అయిపోతూ ఆయనిస్తున్న డైలీ టాస్కులు చేసుకుపోవడమే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మూడో ఆప్షన్‌తో ముందుకు సాగిపోతోంది.






