ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేసేందుకు ఓ పక్క పార్లమెంట్‌లో చట్ట సవరణ జరుగుతుంటే, వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి అమరావతికి ‘ప్లాన్-బీ’ని సూచించడం చాలా విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉంది.
ఆయనేమన్నారంటే, “అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం పది శాతం ఖర్చుతో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిపి రాజధానిగా అభివృద్ధి చేయోచ్చు. ఇప్పటికే ఈ మూడు ప్రాంతాల మద్య 110 కిమీ జాతీయ రహదారి ఉంది. కనుక కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉండదు. ఈ మూడు ఊర్లను కలిపి రాజధానిగా చేసి ‘మావిగన్’ అనే పేరు పెడితే బాగుంటుంది. ఒకవేళ అది నా పేరులా అనిపిస్తే వేరే పేరు పెట్టుకోవచ్చు,” అని జగన్ కూటమి ప్రభుత్వానికి ఓ ఉచిత సలహా ఇచ్చారు.
రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని ఇప్పుడు వాదిస్తున్న జగన్, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి ఒకటి చాలదు.. మూడు రాజధానులు అవసరమన్నారు.
కానీ 4 ఏళ్ళు అలా కాలక్షేపం చేసేసిన తర్వాత ‘విశాఖ రాజధాని’ అన్నారు. ఇప్పుడు చెప్తునట్లుగానే అప్పుడూ జస్ట్ 10 శాతం ఖర్చుతో విశాఖ రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. చివరికి పది శాతం ఖర్చుతోనే రుషికొండపై తన కోసం విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించుకున్నారు. విశాఖ రాజధాని అంటే అదేననట్లు మాట్లాడారు.
అధికారంలో ఉన్నప్పుడు ఇంత చిత్రవిచిత్రంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెద్ద మేధావిలా అమరావతికి ప్లాన్-బీ అంటూ ఈ కొత్త ప్రతిపాదన చేశారు.
ఆయన బుర్రలో ఈ ప్లాన్-బీ ఉన్నప్పుడు అప్పుడే దీనిని అమలు చేయవచ్చు కదా? ఎవరు వద్దన్నారు? కానీ అప్పుడు చెప్పలేదు.. చేయలేదు.
ఇప్పుడే ఎందుకు? అంటే నాడు మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు ఫెయిల్. కనుక ఇప్పుడు మూడు నగరాల ప్రజలను ప్లాన్- బీతో ఆకట్టుకోవచ్చనే దురాశ కావచ్చు.
అయినా అమరావతిని ఆపడం ఇక తన వల్ల కాదని, వచ్చే ఎన్నికలలో అమరావతి వల్లనే వైసీపీకి మరోసారి ఓటమి తప్పదని జగన్ గ్రహించినందునే ఈ ప్లాన్-బీ, సీ, డీలు అమలు చేస్తున్నట్లు అనుమానించక తప్పదు.
ఇటీవల డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో మాట్లాడుతూ, “వాళ్ళు కేవలం 11 మందే ఉన్నప్పటికీ 1100 మంది ఉన్నట్లు అందరూ ముక్తకంఠంతో ఒకే మాటగా చెప్తారు… అది అబద్దమైన సరే!” అని అన్నారు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినప్పుడూ జగన్, వైసీపీ నేతలు ఇదేవిధంగా కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేసి తప్పించుకున్నారు.
ఇప్పుడు అమరావతిని వ్యతిరేకిస్తున్నందుకు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిన ఈ తరుణంలో కూడా 1100 మందిలా అందరూ ముక్తకంఠంతో ఒకే మాటగా చెప్తున్నారు.
తలదించుకోవాల్సిన పరిస్థితిలో తలెత్తుకొని నిలదీస్తుంటే కూటమి నేతలు ధీటుగా జవాబు చెప్పడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
‘జగన్, వైసీపీ నేతల మాటలు ఎవరు పట్టించుకుంటారు లే?’ అని నిర్లక్ష్యంతో కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండిపోతే, అప్పుడు వైసీపీ మాటలే ప్రజలకు బలంగా చేరుతాయి.
గతంలో అమరావతి నిర్మాణ పనులు మొదలుపెట్టినప్పుడూ వైసీపీ ఇలాంటి వాదనలతోనే దూసుకుపోయి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించింది.
కనుక 2019, 2029 ఫలితాలు మ్యాచింగ్ కావాలనుకుంటే హ్యాపీగా కాలక్షేపం చేసేయొచ్చు.




