తన వేలితో తన కన్నే పొడుచుకునే రాజకీయం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి. టీడీపీ మీద రాజకీయ ద్వేషం, బాబు మీద ఉన్న ఉక్రోషం వైస్ జగన్ ని ఆలోచన కోల్పోయేలా చేస్తుంది.
ఒక పార్టీ మీద ఉన్న పంతంతో, ఒక నాయకుడి మీద ఈర్ష్యతో ఒక ప్రాంతాన్ని ద్వేషించడం, రాష్ట్ర భవిష్యత్ ని ప్రశ్నార్ధకంలో నెట్టడం వైసీపీ కి ఎంతవరకు న్యాయం.? రాజధానిగా అమరావతిని సమాధి చేయడమే వైసీపీ అంతిమ ధ్యేయం అన్నట్టుగా జగన్ పావులు కదుపుతున్నారు.
అందులో భాగంగానే నేడు మీడియా ముందుకొచ్చిన వైఎస్ జగన్ అమరావతి పై మరోసారి అనుమానాలు సృష్టించారు. కూటమి ప్రభుత్వం రెండో విడత భూసేకరణ లో భాగంగా రాజధాని ప్రాంతాల గ్రామ రైతుల నుంచి భూసమీకరణకు సిద్దమయ్యింది, ఆ దిశగా పనులు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ ఇంకా ఇన్ని ఎకరాల భూములు ఎందుకు.? ఇప్పటికి గతంలో చేసిన భూ సేకరణకు సంబంధించిన అభివృధి భూములు రైతులకు కేటాయించలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూములెందుకు.? నది భూగర్భాలలో నిర్మించే నిర్మాణాలు నిలబడతాయా.?
అసలు అమరావతి నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదు, విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఉండాలి, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడుంటే రాజధాని అక్కడే, ఒక్క రాజధాని నిర్మాణాల కోసమే 2 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది, అంత పెద్ద మొత్తం ఎక్కడ్నుంచి తెస్తారు.? అంటూ మరోమారు అమరావతి రైతుల మానసిక స్తైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించారు.
అయితే ఇటు పక్క ఏమో రాజధానికి చట్టబద్దత కల్పించాలని, కూటమి ప్రభుత్వ హయంలోనే అమరావతికి రాజధానిగా ఒక గుర్తింపు, గౌరవం, కళ తీసుకురావాలని టీడీపీ శ్రమిస్తుంటే మరోపక్క ఏదోవిధంగా రాజధాని నిర్మాణాలను అడ్డుకోవాలని, అక్కడి ప్రాంత రైతులలో రేపు వైసీపీ అధికారంలోకి వస్తే అన్న భయాన్ని నింపాలని జగన్ అండ్ కో పదేపదే తపిస్తున్నారు.
ఇందులో భాగంగానే వైసీపీ రాజకీయ వ్యూహాత్మకంగానే ఇటువంటి ప్రకటనలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులను ఆలోచనలో పడేసేలా చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వానికి సహకరించకుండా రైతులను భయాందోళనలోకి నెడుతున్నారు.
ఇలా ఇటు టీడీపీ అభివృద్ధి అనే ఆశకు – వైసీపీ విధ్వంసం అనే భయానికి మధ్య రాజధాని రైతులు నలిగిపోతున్నారు. ఈ రెండు పార్టీల రాజకీయ పంతాలకు, పట్టింపులకు, ఇక్కడి ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరికీ తలవంచాలో ఎవరితో తలపడాలో తెలియని అయోమయ స్థితిలో రాజధాని రైతులు విలవిలలాడుతున్నారు.






