వైసీపీ గన్..జగన్ అంటూ చెప్పుకునే వైసీపీ శ్రేణులకు మరో ఏడాదిన్నర వరకు నాకు ప్రజలతో పని లేదు ప్రెస్ తో సరిపెడతా అంటూ జగన్ తేల్చి చెప్పేసారు. అంటే మరో ఏడాదిన్నర పాటు జగన్ ఇలానే బెంగళూర్ టూ తాడేపల్లి ట్రావెల్ చేస్తూ పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించుకుంటూ కాలక్షేపం చేస్తానని చెప్పకనే చెప్పేసారు.
మరి వైసీపీ గన్ పాదయాత్ర రూపంలో బయటకురావడానికి ఇంకా చాల సమయమే ఉందని అటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్ ఒక స్పష్టత అయితే ఇచ్చారు, కానీ బిఆర్ఎస్ తుపాకీ అంటూ చెప్పుకునే కేసీఆర్ విషయంలో పార్టీ శ్రేణులకు ఇంకా కేసీఆర్ ఆగమనం పై ఒక స్పష్టత రాలేదు.
కేసీఆర్ గోడకు తగిలించిన తుపాకీ వంటి వాడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బయటకు వస్తారు, అధికార పార్టీ అంతు చూస్తారు అంటూ కేటీఆర్ ఇచ్చిన ఎలివేషన్ కేసీఆర్ ఎంతవరకు నిలుపుకుంటారు, ఎప్పుడు నెరవేరుస్తారు అనే దాని పై పార్టీ నాయుకులకే స్పష్టత లేదు.
వారాలు, వర్జాలు, ముహుర్తాలు చూసి అడుగేయడానికి రాజకీయాలు వేడుకలు కాదు. అలానే రోజులు, నెలలు లెక్కలు వేసుకుని చేయడానికి పాలిటిక్స్ వడ్డీ వ్యాపారం కూడా కాదు. కానీ ఈ ఇద్దరు నేతలు ఇలా ఎదో ఒక కారణం చెప్పుకుంటూ రోజులు గడుపుతూ ఎన్నికల ముందు వరకు ప్రజల ముఖం చూడరనేది స్పష్టమయింది.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో చివరి ఏడాదిన్నర తప్పితే మొదటి మూడున్నరేళ్లు వీరికి ప్రజలు పట్టరా.? వారి బాగోగులు పట్టవా.? రాష్ట్ర పరిస్థితిని పట్టించుకోరా.? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి చట్ట సభలకు వెళ్ళరు కానీ పార్టీ ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మాత్రం పాదయాత్రలు, పోరాట యాత్రలు చేస్తారా.?
ఇలా రోజులు లెక్కపెట్టుకుంటూ చేసే వైసీపీ రాజకీయానికి ప్రజలు ఇప్పటికే బుల్లెట్లు తీసేసారు, ఇక వర్జాలు చూసుకుని చేసే బిఆర్ఎస్ రాజకీయాన్ని ప్రజలు గోడ కాదు ఏకంగా అటకే ఎక్కించారు. అయినా వీరికి ఇంకా తత్త్వం బోధపడడం లేదు. కాలం చెల్లితే నడిచే గన్ అయినా, గోడకు తగిలించిన తుపాకీ అయినా నిరుపయోగమే…!






