జగన్ ప్రభుత్వం డీఎస్సీ-2024కి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి 6,100 ఉపాధ్యాయపోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 1-2 ఏళ్ళలోపుగా డీఎస్సీ ప్రకటిస్తుందని నిరుద్యోగులు కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూశారు.
కానీ 5 ఏళ్ళు కాలక్షేపం చేసేసి, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతుంటే ఇప్పుడు డీఎస్సీ-2024 అంటూ హడావుడి ఎందుకు చేస్తోందో అర్దమవుతూనే ఉంది. దీని కోసం ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేసినా దరఖాస్తులు స్వీకరణ, వాటి పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 7-8 నెలలు సమయం పడుతుంది. మద్యలో ఏ కారణం చేతైనా కోర్టు కేసులు కూడా ఎదుర్కోవలసివస్తే ఇంకా ఆలస్యమవుతుంది.
తెలంగాణ డీఎస్సీ-2023కి గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. దానిలో 5089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనుకుంది. కానీ అనేక కారణాల వలన నేటికీ ఆ ప్రక్రియ పూర్తవనే లేదు. ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు కూడా.
కనుక జగన్ ప్రభుత్వం ప్రకటించిన ఈ డీఎస్సీ-2024 కూడా రాష్ట్రంలో దాని కోసం ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగులను మభ్యపెట్టి, రాబోయే శాసనసభ ఎన్నికలలో వారి దండుకోవాలనే ఆలోచనతోనే అని చెప్పక తప్పదు. అసలు డీఎస్సీ గురించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్ని రకాలుగా మాట్లాడారో అందరికంటే నిరుద్యోగులకే బాగా తెలుసు.
అసలు తమ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలీనప్పుడు, డీఎస్సీ-2024తో ఉపాధ్యాయ పోస్టులను ఏవిదంగా భర్తీ చేయగలదు?చేయలేనప్పుడు దీని కోసం నిరుద్యోగుల సమయం, శ్రమ, డబ్బు అన్నీ వృధా అవుతాయి కదా?
ప్రజలకు మేలు చేయడం కోసమే సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపి మంత్రులు, లబ్ధిదారులందరూ తమ పార్టీకి కృతజ్ఞతగా ఉండాలని, ఎన్నికలలో తప్పక తమకే ఓట్లు వేయాలని నిసిగ్గుగా అడుగుతున్నారు కదా?
అదేవిదంగా ఇప్పుడు ఈ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ జారీ చేసి ఆ పేరుతో హడావుడి చేస్తూ, రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ తమకే ఓట్లు వేయాలని వైసీపి నేతలు అడగకుండా ఉండరు. అయితే జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు తేకపోవడం వలననే లక్షలాదిమంది యువత డిగ్రీలు చేతపట్టుకుని హైదరాబాద్, బెంగళూరు వలసలు వెళ్ళిపోతున్నారు కదా? వారిని పట్టించుకోని జగన్ ప్రభుత్వానికి డీఎస్సీ-2024 విషయంలో మాత్రం చిత్తశుద్ధి ఉంటుందని ఎలా నమ్మగలం?ఒకవేళ ఉన్నా కేవలం 6,100 పోస్టులతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేయగలదా?
అసలు వైసీపి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? తనకే గ్యారెంటీ లేనప్పుడు నిరుద్యోగులకు ఏమి గ్యారెంటీ ఇవ్వగలదు?కనుక ఇది ఖచ్చితంగా నిరుద్యోగుల ఓట్ల కోసం వేస్తున్న వలే. దీనిలో నిరుద్యోగులు చిక్కుకుంటే వారు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నష్టపోతుందని గుర్తుంచుకోవాలి.




