జగన్‌ భస్మాసుర రాజకీయాలు… మంచిదే!

Jagan Mohan Reddy addressing a public gathering amid political controversy in Andhra Pradesh

భస్మాసురుడి కథ అందరికీ తెలిసిందే. తనకు వరమిచ్చిన ఆ శివుడి నెత్తినే చేయి పెట్టి భస్మం చేయబోతే, చివరికి తన నెత్తిన తానే చేయి పెట్టుకొని భస్మం అయిపోయాడు.

ఏపీ రాజకీయాలకు కూడా ఈ కథను వర్తింపజేసి చూస్తే, జగన్ ఆ భస్మాసురుడిలాగే వ్యవహరించి నష్టపోయారని చెప్పవచ్చు. అధికారమనే వరమిచ్చిన ప్రజలే చివరకు జగన్‌ని గద్దె దించేశారు.

ADVERTISEMENT

వరగర్వంతో జగన్ రాక్షసంగా వ్యవహరిస్తూ తనని తాను ఓడించుకున్నారు. ప్రజల మద్దతే తన శక్తి అన్న వాస్తవాన్ని విస్మరించి, అదే ప్రజల తీర్పుతో అధికారాన్ని కోల్పోయారు.

పురాణాలలో భస్మాసురుడు ఒక్కడే నష్టపోయాడు. కానీ జగన్ అనుచిత వ్యవహార శైలి వల్ల ఆయనను నమ్ముకున్న వైసీపీ నేతలు, లక్షలాది కార్యకర్తలు, చివరికి రెండున్నర లక్షల మంది వాలంటీర్లు కూడా తీవ్రంగా నష్టపోయారు.

ఇంత జరిగినా జగన్ ఆలోచనా విధానం, అహంభావం, మాట తీరు, వ్యవహార శైలి మారకపోగా మరింత ప్రమాదకరంగా మారుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో కూటమి ప్రభుత్వంతో కలిసి స్కామ్ చేస్తున్నవారందరినీ, తాను మళ్లీ ముఖ్యమంత్రి కాగానే రెండు నెలల్లో జైల్లో పెడతానని బెదిరించడమే ఇందుకు తాజా నిదర్శనం.

ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించి పనులు మొదలుపెడితే, జగన్ ముఖ్యమంత్రి కాగానే వాటిని నిలిపివేసి రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం కలిగించారు.

ఇప్పుడు చేతిలో అధికారం లేకపోయినా ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి కాగానే పోలీస్ అధికారులను బట్టలు ఊడదీయిస్తానని, రప్పా రప్పా తలకాయలు నరుకుతామని బెదిరిస్తున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటాలు చేయాల్సిన జగన్, పరామర్శ యాత్రల పేరుతో బలప్రదర్శన చేస్తూ ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు.

ఓ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తుంటే స్వాగతించాల్సింది పోయి, ఈ విధంగా మాట్లాడుతూ అవి భయపడి పారిపోయేలా చేస్తున్నారు.

జగన్ ఈ విధంగా వ్యవహరిస్తుండటం చూస్తున్న ప్రజలు నిజంగానే ఆయనను చూసి భయపడుతున్నారు. ఆ భయంతోనే ప్రజలు తనకే అధికారం కట్టబెడతారని ఆయన భావిస్తున్నట్లున్నారు.

కానీ అదే భయం ప్రజలను ఏకం చేసి, వైసీపీని మరోసారి ఓడిస్తుందనే వాస్తవాన్ని గ్రహించడం లేదు. భయ రాజకీయాలు తిరస్కారానికే దారి తీస్తాయని చరిత్ర చెబుతోంది.

జగన్ ఈ వైఖరే ఆయనకు, వైసీపీకి శాపంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడుతో సహా కూటమి నేతలందరికీ తెలుసు. అయినా తెలియనట్లు నటిస్తూ ఆయన తీరును ఖండిస్తున్నారు.

దాంతో జగన్ మరింతగా రెచ్చిపోతూ వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. కనుక జగన్ వైఖరే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్షగా, అదే వైసీపీ పాలిట శాపంగా మారబోతోందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories