ఎన్నికల సమయం దగ్గర పడడంతో జగన్ సర్కారు కు సొంత పార్టీ నేతల నుండి రాజీనామాల లేఖలు, ప్రభుత్వ ఉద్యోగుల నుండి సమ్మె నోటీసులు ఒకదానిని మించి మరొకటి అందుతున్నాయి. దీనితో జగన్ సర్కారుకు ఈ సారి ఎన్నికలలో గెలవడం అంత ఈజీ కాదనేది సుస్పష్టమయ్యిపోయింది.
గడిచిన నెల రోజుల నుండి తమ డిమాండ్ల సాధన కోసం రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంగన్వాడీలు,ఆశ వర్కర్లు ఒకపక్క, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె మరో పక్క వైసీపీ ప్రభుత్వాన్నిగడగడలాడిస్తుంటే ఇప్పుడు 104 , 108 ఉద్యోగులు జగన్ ప్రభుత్వం తమకిచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ ఆయాశాఖ అధికారులకు నోటీసులు ఇచ్చారు.
సక్రమ వేతనాల చెల్లింపులు లేకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ 108 ,104 ఉద్యోగ సంఘాలు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కలిసి నోటీసులు అందించారు. దీనిపై తక్షణం ప్రభుత్వ స్పందించకపోతే రెండు వారాల తరువాత తమ కార్యాచరణ ప్రకటిస్తాం అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపించారు సదరు ఉద్యోగ సంఘాల నేతలు. అత్యవసర సేవలను అందించే ఈ 108 , 104 ఉద్యోగులు కూడా సమ్మె బాట పడితే ఇక వైసీపీ ప్రభుత్వం ‘వెంటిలేటర్’ మీదకు వచ్చినట్టుగానే భావించాలి.
అలాగే వైసీపీ ప్రభుత్వానికి ప్రైవేట్ సైన్యంలా పని చేస్తున్న వాలంటీర్లు కూడా తమ వేతనాలు పెంచాలంటూ జగన్ సర్కారు పై సమ్మె అస్త్రాన్ని ప్రయోగించారు. ముఖ్యమంత్రి జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యే లు జగన్ మద్దతుదారులు అందరు రాష్ట్రంలో 90 శాతం ప్రజలకు జగన్ సర్కారు వలన మేలు జరిగింది, ఆ కుటుంబాలన్నీ వైసీపీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నాయి కాబట్టి “2024 జగనన్న ఒన్స్ మోర్” అనేది నల్లేరు మీద నడకే అంటూ మైకుల ముందు గొంతులు పోయేలా చెపుతుంటే మరి ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులంతా ఒక్కొక్కరుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తున్నట్టు?
జగన్ సర్కార్కు విడతల వారీగా సమ్మె నోటీసులు ఎందుకు అందిస్తున్నట్టు? పార్టీ వీడుతున్న ఎమ్మెల్యే లను కాపాడుకోలేక, సమ్మె బాట పడుతున్న ఉద్యోగులను నియంత్రించలేక ప్రతిపక్షాల పై నిందలు వేసి కాలం నెట్టుకురావాలన్న జగన్ ఆలోచన ఈసారి ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.




