ప్రతీ మనిషికి పుట్టుకతోనే లింగ నిర్ధారణ అయినంత సహజంగా కులం, మతం, పౌరసత్వం, భాష, సంస్కృతి, ఆచార సంప్రాదాయాలు కూడా ఖరారు అయిపోతాయి.
అయితే పెరిగి పెద్దయిన తర్వాత కొందరు శస్త్ర చికిత్సలు చేయించుకొని లింగ మార్పిడి చేయించుకున్నట్లే, కొందరు పైన పేర్కొన్నవన్నీ కూడా మార్చుకోవచ్చు. యధాతధంగా ఉంచుకోవచ్చు. లేదా కొన్ని ఉంచుకొని కొన్ని వదులుకోవచ్చు.
కానీ ప్రతీ మనిషికి ఓ సొంత గుర్తింపు అంటూ ఉంటుంది. దానిని ఎవరూ మార్చుకోలేరు. అలా మార్చుకోవాలని ప్రయత్నించినప్పుడు నవ్వులపాలవుతారు.
ఉదాహరణకు ప్రధాని మోడీ గుజరాతీ హిందూ. సిఎం చంద్రబాబు నాయుడు ఏపీ హిందూ. జగన్మోహన్ రెడ్డి ఏపీ క్రీస్టియన్. ఈ గుర్తింపులు వారికి అవమానకరం కానే కాదు. అవి కేవలం వారి ఉనికికి గుర్తింపులే.
కనుక వాటిని దాచి పెట్టుకొని వేరేగా నటించనవసరం లేదు. కానీ మన దేశం అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుంది. కనుక పిఎం, సిఎం హోదాలో ఉన్నవారు ఇతర మతాలను కూడా గౌరవిస్తుంటారు. అంత మాత్రాన్న వారు ఆ మతాన్ని స్వీకరించినట్లు కాదు. అనుసరిస్తున్నట్లు కాదని అందరికీ తెలుసు.
కానీ క్రీస్టియన్ మతాన్ని అనుసరించే వైసీపీ అధినేత జగన్, తాను హిందూమతాన్ని అమితంగా ప్రేమిస్తానని నిరూపించుకోవడం కోసం తనకు నమ్మకం లేని హిందూ మతాన్ని చాలా నిష్టతో పాటిస్తున్నట్లు నటిస్తుంటారు.
సాంప్రదాయ దుస్తులు ధరించి, నుదుట బొట్టు పెట్టుకొని పూజలు చేస్తుంటారు. నదులలో పుణ్య స్నానాలు చేస్తుంటారు.
ఎందుకు?అంటే రాష్ట్రంలో హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు అని అందరికీ తెలుసు.
ఇందుకు తాజా నిదర్శనంగా ఒంటిమిట్ట రామాలయం పూజారులను ఇంటికి పిలిపించుకొని వారితో వేదాశీర్వచనాలు తీసుకోవడం.
అత్యుత్సాహం ప్రదర్శించి ప్యాలస్ వెళ్ళిన ముగ్గురు అర్చకులకు టిటిడీ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే కటిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
జగన్ హిందువులను ఆకట్టుకునేందుకు చేసిన ఈ ప్రయత్నంలో ముగ్గురు అర్చకులు ఇలా బలైపోవడం విచిత్రమే కదా?
మరో నిదర్శనం: దివి నుంచి భువికి గంగని రప్పించిన భగీరధ మహర్షి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన చిత్రం పెట్టి ఆ మహర్షికి కూడా కులం అంటగట్టి ఆయన కులానికి చెందిన సగర కులస్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జగన్! ఇది హిందూమతంపై అభిమానమా లేక ఓటు బ్యాంక్ రాజకీయమా?
కానీ హిందుత్వవాదంతో రాజకీయాలు చేసే బిజేపికే ఎన్నడూ హిందువులు గంపగుత్తగా ఓట్లు వేయలేదు. ఇలాంటి వేషాలు వేసినంత మాత్రాన్న రాష్ట్రంలో హిందువులు వైసీపీకి ఓట్లు వేసేస్తారని ఎలా అనుకున్నారో?
ప్రజల ఓట్లు కావాలంటే వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. వాటిని అనుగుణంగా నడుచుకోవాలి. అమరావతి వద్దు మావిగన్ ముద్దు… రప్పా రప్పా అనడం మానుకొని రాష్ట్రాభివృద్ధి జరగాలని, పరిశ్రమలు పెట్టుబడులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటే చాలు.




