ఇది ఎన్నికల సమయం కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితిని నిశితంగా గమనిస్తే కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య అభివృద్ధిలో చాలా తేడా ఉందనే విషయం అందరికీ తెలుసు. రెండు రాష్ట్రాల రాజకీయాలలో కూడా చాలా తేడా కనిపిస్తుంది.
తెలంగాణలో రాజకీయాలలో కక్ష సాధింపులు పెద్దగా కనబడవు. ఎన్నికల సమయంలో పార్టీల వ్యూహాలు, ఫిరాయింపులు కనబడతాయి కానీ భౌతికదాడులు, హత్యా రాజకీయాలు కనబడవు. కానీ ఏపీలో ఇవన్నీ నిత్యకృత్యాలుగా మారిపోయాయి.
ఏపీలో వైసీపి, తెలంగాణలో బిఆర్ఎస్ ఎంపీల పనితీరు, వైఖరిలో కూడా చాలా తేడా కనబడుతుంటుంది. తెలంగాణ ఎంపీలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో ధైర్యంగా పోరాడుతుంటారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ రాష్ట్రానికి రావలసిన నిధులు, అనుమతులు అన్నీ సాధించుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.
కానీ వైసీపికి 23 మంది ఎంపీలున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు.
ఒకరు వివేకా హత్య కేసులో, మరొకరు లిక్కర్ స్కామ్‌లో చిక్కుకొంటే, మరొకరు ఓ వీడియోతో ఎంత ప్రసిద్ధి చెందారో అందరికీ తెలుసు. వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి నిత్యం మోడీ, అమిత్ షాలతో ఫోటోలు దిగుతూ వారి భజన చేస్తూ, నిత్యం చంద్రబాబు నాయుడు లేదా దగ్గుబాటి పురందేశ్వరిని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
తెలంగాణలో అధికార, ప్రతిపక్ష ఎంపీలు చాలా ధైర్యంగా శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తుంటారు. అదే… ఏపీలో ఎంపీలు అధిష్టానం ఒత్తిడి చేస్తున్నా శాసనసభ ఎన్నికలలో పోటీకి ఇష్టపడరు.
తెలంగాణలో మంత్రులు శాసనసభకు పోటీ చేసేందుకు పోటీలు పడుతుంటే, ఏపీ మంత్రులలో చాలామంది ఈసారి ఎన్నికలలో పోటీ చేయలేమని ముందే చెప్పేశారు. తమకి బదులు తమ కుటుంబ సభ్యులకు టికెట్స్ ఇమ్మనమని అభ్యర్ధిస్తున్నారు.
చివరికి తెలంగాణలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి మరీ రాజకీయాలలోకి వస్తున్నారు. కొంతమంది అధికారులు అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరుతుంటే కొందరు ప్రతిపక్షాలలో చేరి తమ అదృష్టం పరీక్షించుకొంటున్నారు. అదే ఏపీలో అధికారులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కోర్టులలో మొట్టికాయలు తప్పడం లేదు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టి పనిచేయవలసి ఉండగా వైసీపి ప్రభుత్వం రాజకీయాలు, ఓట్లు, ఎన్నికలపై మాత్రమే దృష్టి పెడుతుండటంతో ఏపీలో కేవలం రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వంటి అక్షయపాత్ర లభించిందని సంతోషిస్తూ కూర్చోకుండా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి పెట్టి పనిచేసుకుపోతున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తుంటారు.
అందుకే తెలంగాణ రాజకీయ వాతావరణం ఇంకా ఆరోగ్యంగా ఉంది. అందుకే అందరూ రాజకీయాలలో పాల్గొనగలుగుతున్నారు. కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాజకీయాలలో పాల్గొనలేని దుస్థితి నెలకొంది. అంటే రాజకీయ వాతావరణం బాగుండటం ఎంత అవసరమో అర్దమవుతోంది.




