ఇది ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సేవలకు సంబందించిన విషయం. ఆయన ఇప్పుడు ఇతర పార్టీల కోసం పనిచేయడం మానేసి తన సొంత రాష్ట్రమైన బిహార్‌లో ‘జన సురాజ్’ అనే సొంత పార్టీ పెట్టుకొని ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. కేంద్రంలో బీజేపీతో సహా అనేక పార్టీలను గెలిపించిన ఆయన బిహార్‌లో తన సొంత పార్టీని గెలిపించుకోలేరని అనుకోలేము. లేకపోతే అది ఆయనకే అవమానం అవుతుంది.
ఇప్పుడు విషయం అది కాదు. ఇటీవల ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడినప్పుడు ఓ ప్రశ్నకు సమాధానంగా తాను ఏదైనా ఓ రాజకీయ పార్టీకి సేవలందిస్తే తన ఫీజు కింద కనీసం వంద కోట్లు తీసుకునేవాడినని చెప్పారు.
ఆయన ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్, బీజేపీలతో సహా 7-8 పార్టీలకు పనిచేశారు. వాటిలో ఏపీలోని వైసీపి కూడా ఒకటి.
2019 ఎన్నికలలో వైసీపిని గెలిపించి జగన్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. తన ఫీజు వంద కోట్లు అని ప్రశాంత్ కిషోర్ స్వయంగా బయటపెట్టారు. కనుక జగన్ వంద కోట్లు ఆయనకు చెల్లించారని స్పష్టం అవుతోంది.
వంద కోట్లు చెల్లించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోన్న జగన్ ఆ తర్వాత 5 ఏళ్ళపాటు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని ఎడాపెడా దోచుకున్నారు. వైసీపి నేతలకు కూడా దోచిపెట్టారు.
కానీ ప్రశాంత్ కిషోర్ తప్పుకున్న తర్వాత ఆయన ఏర్పాటు చేసిన ఐప్యాక్ సేవలను జగన్ 5 ఏళ్ళు వాడుకున్నారు. మరి దానికి ఎన్ని వందల కోట్లు చెల్లించారో ఎవరికీ తెలియదు. కానీ ఈసారి ఎన్నికలలో ఓడిపోవడంతో అదంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవాలని అనుకున్నారు. ప్రశాంత్ కిషోర్ తనకు మంచి మిత్రుడని ఒక్క రూపాయి తీసుకోకుండా బిఆర్ఎస్ పార్టీకి సేవలందించేందుకు ముందుకు వచ్చారని కేసీఆర్ స్వయంగా చెప్పారు. కానీ ఆయన కేసీఆర్ కోసం పనిచేయలేదు.
రాజకీయాలలో కేసీఆరే అపర చాణక్యుడి వంటివారని కనుక బిఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలు అవసరం లేదని భావించి కేసీఆరే ఆయనని వద్దనుకున్నారని బిఆర్ఎస్ ప్రచారం చేసుకుంది.
కానీ ప్రశాంత్ కిషోర్‌కి వందకోట్లు ఇచ్చేందుకు కేసీఆర్‌కి మనస్కరించకనే వద్దనుకున్నారని ఇప్పుడు అర్దమవుతోంది.
జగన్‌కి ఏదో విదంగా ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడుతుండేవారు. కనుక ప్రశాంత్ కిషోర్‌కి వంద కోట్లు చెల్లించి తన కల నెరవేర్చుకున్నారని భావించవచ్చు.




