జగన్‌-కేటీఆర్‌ ఫోటో మెసేజ్… ఎవరి కోసం?

Jagan KTR politics

ప్రస్తుతం ఏపీ జగన్‌, తెలంగాణలో కేటీఆర్‌ పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో ఓటమి, ఎఫ్‌-1 రేసింగ్ కేసులో ప్రాసిక్యూషన్‌కి గవర్నర్ అనుమతించడం, కల్వకుంట్ల కవిత దెప్పి పొడుపులతో కేటీఆర్‌ సతమతమవుతున్నారు.

ఇక్కడ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతలు వరుసపెట్టి అరెస్ట్‌ అవుతూనే ఉన్నారు. అది సరిపోదన్నట్లు తిరుపతి పరకామణి కేసు ఊహించని మలుపు తిరిగి పీకలకు చుట్టుకునేలా ఉంది. ఎప్పుడు ఏ కేసులో ఎవరు జైలుకి పోతారో తెలీని పరిస్థితి. ఆ కారణంగా వైసీపీ నేతలలో ఆందోళన నెలకొంది. అధికారం కోల్పోయి ఏడాదిన్నర అవుతున్నా ప్రజల మధ్యకు వచ్చేందుకు జగన్‌ భయపడుతున్నారు. కానీ వస్తే మాత్రం ‘రప్పా రప్పా’ అంటున్నారు.

ADVERTISEMENT

ఈ దురలవాటు ఎంతగా పెరిగిపోయిందంటే పరమర్శ యాత్రలైనా, శబరిమాల యాత్రలకైనా, చివరికి కోర్టు విచారణకు జగన్‌ హాజరైనా ఇలా బలప్రదర్శన చేయడం, ‘రప్పా రప్పా పోస్టర్స్’ ప్రదర్శించడం పరిపాటిగా మారింది.

ఈ ఫ్యాక్షనిజం పోకడలు చూసి ప్రజలలో మరింత వ్యతిరేకత పెరుగుతుందని పార్టీలో సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. కానీ జగన్‌ మాత్రం ‘రప్పా రప్పా’తోనే ప్రజలను, అధికారులను అందరినీ లొంగ’దీసుకొని మళ్ళీ అధికారంలోకి రాగలనని గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. జగన్‌కు ఈ మద్య కాలంలో చెల్లి షర్మిల పోరు కాస్త తగ్గినప్పటికీ ఆమె పక్కలో బల్లెంలా నిలిచే ఉన్నారు.

అక్కడ బీఆర్ఎస్‌, ఇక్కడ వైసీపీ రెండింటి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రెండు పార్టీలకు ఎవరితో పడదు. అందరినీ శత్రువులుగానే భావిస్తుంటాయి. కనుక ఏకాకులుగా మిగిలిపోయాయి.

ఇలాంటి సమయంలో జగన్‌, కేటీఆర్‌ ఇద్దరూ బెంగళూరులో ఓ కార్యక్రమంలో ఇటీవల కలిసినప్పుడు దిగిన ఫోటోని కేటీఆర్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తద్వారా నేటికీ జగన్‌కు అండగా బీఆర్ఎస్‌ పార్టీ ఉందని చెప్పకనే చెప్పారు. అలాగే జగన్‌ మద్దతు బీఆర్ఎస్‌ పార్టీకే ఉందని తెలంగాణలో జగన్‌, వైసీపీ అభిమానులకు తెలియజేసినట్లే భావించవచ్చు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో టీడీపి అభిమానులు అందరూ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేశారు. అందువల్లే కాంగ్రెస్‌ గెలిచింది. కానీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జగన్‌ అభిమానులు, ముఖ్యంగా క్రీస్టియన్, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు మాత్రం బీఆర్ఎస్‌ పార్టీకి ఓట్లు వేయలేదనే వాదనలు వినిపించాయి. కనుక వైసీపీతో దోస్తీ వలన బీఆర్ఎస్‌ పార్టీ నష్టమే తప్ప లాభం లేదనే వాదనలు వినిపించాయి. బహుశః ఆ విమర్శలకు జవాబుగా కేటీఆర్‌ ఈ ఫోటో పోస్ట్ చేసి ఉండవచ్చు.

ADVERTISEMENT
Latest Stories