ఏడాది తర్వాత తాపీగా పరామర్శ.. దారిలో ఓ ప్రాణం తీశారుగా!
బంధుమిత్రులో పరిచయస్థులో ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళి పరామర్శించడం ఆనవాయితీ. ఒకవేళ ఏ కారణం చేతైనా కుదరకపోతే దశదిన కర్మ రోజున లేదా వీలైనంత త్వరలో వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం ఆనవాయితీ.
కానీ ఊళ్లోనే ఉన్నా ఓ వ్యక్తి చనిపోయిన ఏడాది తర్వాత వెళ్ళి పరామర్శించడాన్ని ఏమనుకోవాలి?నేడు జగన్ అదే చేశారు.
పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మండలం, రెంటపాళ్ళ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కొర్లకుంట నాగ మల్లేశ్వరరావు, ఎన్నికలలో వైసీపీ తప్పకుండా గెలుస్తుందనే జగన్ మాటలు నమ్మి, అప్పులు చేసి సుమారు రూ.2 కోట్లు పందాలు కాసారు. కానీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు.
కనుక ఒకవేళ జగన్ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చాలనుకుంటే అప్పుడే వెళ్ళి ఓదార్చవచ్చు. వీలైతే ఆయన చేసిన అప్పులు తీర్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవచ్చు.
కానీ అప్పుడు జగన్ కూడా ఓటమి షాక్‌లో ఉన్నారు. కనుక వెళ్ళలేకపోయినా తేరుకున్న తర్వాత జైల్లో ఉన్న రౌడీ షీటర్స్, తెనాలిలో ఉన్న రౌడీ షీటర్స్‌తో సహా చాలా మందినే జగన్ పరామర్శించారు.
కనుక తన మాట నమ్మి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త మల్లేశ్వరరావు తల్లి తండ్రులను అప్పుడే పరామర్శించవచ్చు. కానీ పరామర్శించలేదు!
ఇప్పుడు తాపీగా పోలీసులు వారిస్తున్నా వేలాదిమందితో ఊరేగింపుగా వెళ్ళి పరామర్శించి మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేశారు.
కార్యకర్తల పట్ల జగన్ నిబద్దత ఇలా ఉంటుందని తెలుస్తున్నా నేడు ఆయన వెనుక వేలాదిమంది బైకులు, స్కూటీలు వేసుకొని వైసీపీ జెండాలు పట్టుకొని జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ సత్తెనపల్లిలో ప్రజలను భయాందోళనలకు గురిచేశారు.
ఓ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్, పోలీస్ ఆదేశాలను ధిక్కరించి వేలాదిమందితో ఊరేగింపుగా రెంటపాళ్ళ గ్రామానికి వెళ్ళడమే కాకుండా దారిలో ఓ వృద్ధుడిని పొట్టన పెట్టుకున్నారు కూడా.
జగన్ కాన్వాయ్‌ని అనుసరిస్తున్న వాహనాలు రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ఓ వృద్ధుడిని ఢీ కొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు ఆయనని పక్కకి ఈడ్చేసి ముందుకు సాగిపోయారు!
స్థానికులు ఆయనని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చేసిన పాపం ఏమిటంటే ఏటుకూరు సమీపంలో లాల్ పురం హైవే పక్కన నిలబడి ఉండటమే!
ఏడాది క్రితం చనిపోయిన ఓ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతూ, దారిలో ఓ వృద్ధుడి ప్రాణాలు తీశారు కదా జగన్?
ఈ విషయం తెలిసిన తర్వాత అయినా ఆస్పత్రికి వెళ్ళి ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పి, నష్టపరిహారం చెల్లించవచ్చు కదా? కానీ తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోలేదని, తమ కార్యకర్తని టీడీపీ వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసిందని జగన్ ఆరోపణలు చేశారు.
టీడీపీ వేధింపుల వల్లనే వైసీపీ కార్యకర్త మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని వాదిస్తున్న జగన్ & కో, ఈ వృద్ధుడి చావుకి ఎవరు కారకులో చెప్పగలరా?




