ఓటమిలో కూడా బిఆర్ఎస్ ను కాపాడేందుకు కేసీఆర్ కు తోడు ఆయన తనయుడు కేటీఆర్ ఉన్నారు, అలాగే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కనిపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి నుంచి నేటి వరకు కేసీఆర్ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ పార్టీని రాజకీయంగా బలంగా ముందుకు తీసుకెళ్లగలుతున్నారు.
రేవంత్ రెడ్డి ఎంత దూకుడుగా బిఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నా, కాళేశ్వరం, ఫోన్ టాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంటూ కేసీఆర్ నుంచి హరీష్, కేటీఆర్ వరకు పలురకాల కేసులు ఎదుర్కొంటున్నా, మరోపక్క కవిత రూపంలో బిఆర్ఎస్ రాజకీయానికి పెను ప్రమాదం పొంచి ఉన్నా కేటీఆర్, హరీష్ రేవంత్ సర్కార్ తో పోరాటం చేస్తూనే ఉన్నారు.
పార్టీని ఎదోరకముగా ప్రజల మధ్య నిలబెడుతూనే వస్తున్నారు. ఇలా బిఆర్ఎస్ కోసం కేసీఆర్ కి తోడు హరీష్, కేటీఆర్ ఇద్దరు కూడా కవచాలుగా నిలబడ్డారు. కానీ వైసీపీ విషయంలో జగన్ కు అటువంటి బలమైన కవచాలు ఎవరు.? అసలు ఉన్నారా.? జగన్ ఎవరినైనా నమ్మి తన పార్టీలో అటువంటి స్థానం అప్పగిస్తారా.?
ఒకప్పుడు వైసీపీ కోసం జగన్ కు తోడుగా ఆయన చెల్లి షర్మిల అండగా నిలిచారు, అలాగే తల్లి విజయలక్ష్మి కూడా తన వంతుగా వైసీపీ కోసం శ్రమించారు. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. అలాగే వైసీపీ పుట్టుక నుంచి నిన్న మొన్న వైసీపీ ఘోర ఓటమి వరకు జగన్ కు తోడుగా ఉన్న విజయసాయిరెడ్డి సైతం జగన్ కు దూరంగా వైసీపీ ని విడిచి వెళ్లారు.
ఇప్పుడు వైసీపీ కోసం జగన్ కు తోడుగా ఉండే ఆ బలమైన శక్తి కోసం వైసీపీ శ్రేణులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సజ్జల శల్య సారధ్యం మీద పార్టీ సొంత క్యాడర్ కూడా అసహనంతో రగిలిపోతున్నారు. ఒకపక్క అన్న వదిలిన బాణంగా వైసీపీ కోసం బలంగా నిలబడిన చెల్లి షర్మిలను వదులుకున్నారు, తల్లి విజయలక్ష్మిని వద్దనుకున్నారు.
మరోపక్క ఇన్నాళ్ళుగా వైసీపీ రాజకీయానికి వెన్నుముకగా నిలిచిన సాయిరెడ్డి ని దూరం చేసుకున్నారు, మరి ఇప్పుడు బిఆర్ఎస్ కోసం కేసీఆర్ కి హరీష్, కేటీఆర్ మాదిరి వైసీపీ కోసం జగన్ కి ఎవరు అన్న ప్రశ్న వైసీపీ శ్రేణులను సైతం కలవరపెడుతుంది.
వైసీపీ లో జగన్ తరువాత స్థానం ఎప్పుడు ఖాళీయేనా.? వైసీపీ లో జగన్ తరువాత అంతటి రాజకీయ ఛరిష్మా ఉన్న నేత ఉండడం అసాధ్యమేనా.? పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ నిరాశ, నిస్పృహలో ఉన్నప్పుడు వారి భుజం తట్టి ధైర్యం చెప్పేందుకు టీడీపీ కి లోకేష్ మారింది వైసీపీ కి ఒకరు కావాల్సిందేనా.? మరి ఆ ఒక్కరు ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్న.




