వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్‌మీట్‌లో అమరావతి, మావిగన్ గురించి మాట్లాడిన మాటలు విన్నప్పుడు, ఎవరికైనా వాటి గురించి ఆలోచన రాదు. ‘జగన్ ఎప్పుడూ ఇంతేనా? ఎన్నటికీ మారరా?’ అనే ఆలోచన కలుగుతుంది. ఓ పక్క అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతుంటే, “ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు,” అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిజానికి జగనే 5 ఏళ్ళ పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారు. నేడు మళ్ళీ అమరావతిని ఇంతగా వ్యతిరేకిస్తున్న జగన్, నాడు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు ఆడిందే ఆట అన్నట్లు ఇష్టారాజ్యం చేస్తున్నప్పుడు తాను కోరుకున్నట్లే విశాఖ రాజధాని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా? మూడన్నారు కానీ ఒకటీ చేయలేకపోయారు.
మూడు రాజధానుల కాన్సెప్ట్ కనిపెట్టిన గొప్ప మేధావి జగనే మావిగన్ కూడా కనిపెట్టడం పెద్ద విశేషమే కాదు. కానీ మావిగన్ అంటే సిఎం చంద్రబాబు నాయుడు బీపీ పెరిగి గుండె ఆగి చనిపోతారని జగన్ అన్నారు. ఆయన చనిపోవాలని కోరుకుంటున్నారంటే జగన్ ఎంతగా ద్వేషిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వైసీపీని గొడ్డలి పార్టీ సిఎం చంద్రబాబు నాయుడు ఊరికే అనలేదు.
ఫారిన్‌లో ఉన్నత విద్యలభ్యసించి వచ్చిన యువకుడినని చెప్పుకునే జగన్ ఇంకా ‘క్యూఆర్ కోడ్ స్కానింగ్’ వద్దనే ఉండిపోతే, చంద్రబాబు నాయుడు క్వాంటం కంప్యూటింగ్ వరకు వెళ్ళిపోయారు.
జగన్ కేవలం ‘ఎన్నికల నుంచి ఎన్నికల వరకు’ మాత్రమే ఆలోచించగలరు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు మరో 30 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో, దేశంలో జనాభా, అవసరాలు, పరిస్థితులు, ఏవిధంగా ఉండబోతున్నాయని ఆలోచించి అందుకు తగిన ప్రణాళికలు అమలుచేసే అంత దూరదృష్టి ఉంది. కనుకనే భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అమరావతి నిర్మిస్తున్నారు.
‘మావిగన్’ అంటే చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడతారని జగన్ ఎద్దేవా చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటు ఆమోదముద్ర వేస్తోందనే ఆందోళనతోనే నాడు జగన్ హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి మావిగన్ అన్నారు కదా? కానీ ఆ తర్వాత మళ్ళీ నిన్నటి వరకు జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ ‘మావిగన్’ అనడానికి సాహసించలేదు. ఎందువల్ల? మావిగన్ అంటే ప్రజాగ్రహానికి గురవుతామనే భయంతోనే కదా?
తన మాటలకు, ప్రతిపాదనలకు కూడా కట్టుబడలేని, వాటి గురించి చెప్పుకునే ధైర్యం లేని జగన్, అమరావతి రాజధాని అని చెప్పి దానికి కట్టుబడి నిర్మిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
శరవేగంగా సాగుతున్న అమరావతి నిర్మాణ పనులను చూస్తున్నకొద్దీ జగన్‌లో ఆందోళన పెరిగిపోతూనే ఉంది. అదే అయన మాటల్లో వ్యక్తమైంది.
వచ్చే ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అమరావతిని చూపించి ఓట్లు అడిగితే జగన్ వద్ద చెప్పుకోవడానికి ఏముంటుంది?సిఎం చంద్రబాబు నాయుడుని ద్వేషించడం, విమర్శించడం వలన వైసీపీకి ఓట్లు రాలవు కదా? అందుకే ఈ కలవరం… ఈ ప్రెస్‌మీట్లు… ఈ శాపనార్ధాలు. కానీ పిల్లి శాపలకి ఉట్టి తెగదు కదా?




