ప్రభుత్వం రాష్ట్రం, ప్రజలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీకి రాజధాని అమరావతికి ప్రధాని మోడీ స్వయంగా భూమిపూజ చేశారు. కానీ జగన్ దానిని కాదని మూడు రాజధానులన్నారు.
తర్వాత విశాఖ రాజధాని అన్నారు. అమరావతిని ఎన్నటికీ రాజధాని చేయకుండా అడ్డుకునేందుకు రాజధానిలో ‘సెంటు భూములు’ లేఅవుట్లు వేసి పేదలకు పంచి పెట్టేశారు.
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపి, జనసేన, బీజేపిలు జగన్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు చెప్పాయి. న్యాయస్థానాలను ఆశ్రయించాయి. అంతేకాని జగన్‌లాగ రాజధాని మారిస్తే తాము అధికారంలోకి రాగానే ఆయనని, వైసీపీ నేతలను, వారికి సహకరించిన అధికారులను జైల్లో పెడతామని బెదిరించలేదు. నిజానికి రాజధాని విషయంలో వైసీపీ నేతలే చాలా హడావిడి చేశారు తప్ప ప్రతిపక్షాలు చేయలేదు.
సంస్కరణల పేరుతో విద్యా వ్యవస్థపై జగన్ అనేక వికృత ప్రయోగాలు చేశారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్ వ్యవస్థని సృష్టించారు. లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు, బోనసులు, సాక్షి న్యూస్ పేపర్లు ఇచ్చారు.
వైసీపీ రంగులు, అన్నిటిపై తన బొమ్మలు, పేర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఆ జాబితాకు అంతేలేదు. కానీ ఆనాడు ప్రతిపక్షాలు ఆ నిర్ణయాలను వ్యతిరేకించాయి. నిరసించాయి తప్ప ఎవరినీ జైలుకి పంపుతామని బెదిరించలేదు.
కానీ తాము అధికారంలోకి వస్తే తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నవారిపై, తమ కార్యకర్తలను వేధిస్తున్నవారిపై, తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నవారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మాట నిజం. ఆ హెచ్చరికలు హేతుబద్ధమే కదా?
ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలలో 4 కాలేజీలను ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్యం పద్దతిలో నిర్మించి నిర్వహించాలనుకుంది.
అదీ.. కేంద్ర ప్రభుత్వ నూతన విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని నిర్మించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 30:30 శాతం, ప్రైవేట్ సంస్థలు మిగిలిన 40 శాతం పెట్టుబడి పెడతాయి. అంటే 60 శాతం వాటా ప్రభుత్వానిదే. కనుక అవి ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే పని చేస్తాయి.
కానీ దీనినే జగన్ ప్రైవేటీకరణ అని వితండవాదం చేస్తూ, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నవారిని తాను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో జైలుకి పంపిస్తానని హెచ్చరించారు.
అంటే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని అమలుచేయబోతే దానిని జగన్ బెదిరించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న మాట!
ఒకవేళ జగన్ అమరావతి, పోలవరం, రాష్ట్రంలో మిగిలిన అభివృద్ధి పనుల విషయంలో కూడా ఇలాగే బెదిరిస్తే కూటమి ప్రభుత్వం వాటిని కూడా పక్కన పెట్టేస్తుందా?
మెడికల్ కాలేజీల విషయంలో జగన్ ఈవిధంగా బెదిరించడం రాజద్రోహమే కదా? ఇందుకు ఆయనపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ అయన బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని ప్రభుత్వం అందరికీ నచ్చచెప్పుకోవాల్సి కర్మ ఏమిటి?




