నీళ్లు…లిక్కర్ లా కేసీఆర్, జగన్..!

Jagan Mohan Reddy and KCR Are Like Water and Liquor

రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారం చేతులు మారింది, తెలంగాణలో రాదనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఎమ్మెల్యే గా కూడా అర్హత లేదంటూ హేళన చేసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీనితో బిఆర్ఎస్ అధిష్టానం మూగబోయింది. ప్రజా క్షేత్రానికి కనుమరుగయ్యింది.

ఇక ఇటు ఏపీ విషయానికొస్తే 30 ఏళ్ళు నాదే అధికారం, వై నాట్ 175 అంటూ ఊహాలోకంలో ఊరేగిన వైసీపీ కి వాస్తవ పరిస్థితులు తెలిసేలా 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నాడు అవమానింపబడ్డ బాబు నేడు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అందుకున్నారు. దీనితో ఇటు వైసీపీ అధిష్టానం బెంగళూర్ – తాడేపల్లి ప్యాలస్ ల మధ్య విహార యాత్రలు చేస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ రెండు పార్టీలు గత ఐదేళ్లు ఒకే ఎంజెండాతో తెరచాటు రాజకీయం నడుపుతూ అటు ఏపీలో ఇటు తెలంగాణలో తమ ప్రత్యర్థి పార్టీల నేతల మీద తమదైన రాజకీయం చేసారు. ఒకరు ప్రత్యక్ష దాడులను ప్రోత్సహిస్తే మరొకరు పరోక్ష బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఇప్పుడు ఇద్దరు నాయకులు ఒకేసారి అధికారానికి దూరమై ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటు నీళ్లు, లిక్కర్ మాదిరి కలిసి ప్రతిపక్ష ప్రయాణం చేస్తున్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం అవినీతిమయం, అక్రమాల పుట్ట అంటూ రేవంత్ సర్కార్ ఇందుకు సంబంధించిన విచారణకు కేసీఆర్ హాజరుకావాలంటూ నోటీసులు అందచేసింది.

ఇటు ఏపీలో మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే లిక్కర్ పాలసీ ప్రక్షాళన అంటూ ఏపీలో ఉన్న అన్ని వైన్ షాపుల లైసెన్స్లను రద్దు చేస్తూ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేలా జీవో లు తీసొకొచ్చింది. అయితే గత ఐదేళ్లు వైసీపీ హయాంలో జరిగిన మద్యం మాఫియా దేశంలోనే పెద్ద లిక్కర్ స్కాం గా అభివర్ణించింది ఏపీ ప్రభుత్వం.

అందుకుగాను విచారణ చేపట్టిన ప్రభుత్వం ఈ కేసును సిట్ కు అప్పగించింది. అయితే సిట్ విచారణలో భాగంగా ఇప్పటికే ఈ కేసులో జగన్ సన్నిహితులు, వైసీపీ అక్రమదారులు ఒక్కొక్కరుగా అరెస్టవుతున్నారు. ఇక రేపో మాపో ఈ కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారి వైస్ జగన్ కూడా అరెస్టు కాబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

అలాగే వైసీపీ ముఖ్య నేతలు కూడా ఈ వార్తలను బలపరిచేలా జగన్ కేసులకు, అరెస్టులకు భయపడే వ్యక్తి కాదు అంటూ పార్టీ క్యాడర్ ను ముందుగానే సంసిద్ధం చేస్తున్నారు. అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కి కాళేశ్వరం గండం, ఇటు ఏపీ మాజీ ముఖ్యమంత్రికి లిక్కర్ స్కాం ప్రమాదం పొంచి ఉన్నాయనే అభిప్రాయం ఇరు పార్టీల నాయకుల నుండి వ్యక్తమవుతోంది.

దీనితో ఈ ఇద్దరి నాయకులు కేసీఆర్, జగన్ ల మధ్య నీళ్లు, లిక్కర్ బంధం దృఢంగా ఉంది అంటున్నారు ప్రత్యర్థి పార్టీల శ్రేణులు. మరి ఇందులో ప్రభుత్వం వేసిన విచారణ గేలంలో చిక్కే ఆ తొలి అధినేత ఎవరో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories