సామాన్య ప్రజలకి పోలీస్ స్టేషన్ లేదా కోర్టు నుంచి నోటీస్ వస్తే నాకు ఖాళీ ఉన్నప్పుడు వీలైతే వస్తామని చెప్పడానికి ఉండదు. చెప్పిన సమయానికి టంచనుగా హాజరవ్వాల్సిందే. కానీ సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రం వారికి తీరికున్న సమయంలోనే హాజరవుతుంటారు.
కోర్టుకి హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారి పట్ల పోలీసులు, కోర్టులు చాలా ఉదారంగా, విశాల హృదయంతో వ్యవహరిస్తుంటాయి. వారు కోరినట్లే వారికి తీరిక ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతిస్తుంటాయి.
సామాన్య ప్రజలకు కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది కానీ వాడుకోవడం లేదని అనొచ్చు. కానీ సామాన్య ప్రజలు న్యాయవాదులను పెట్టుకోలేరు. పైగా కోర్టులు, పోలీస్ స్టేషన్లు అంటే కొంత భయం, ఆందోళన కూడా ఉంటాయి. కనుక వారు ఎటువంటి మినహాయింపులు కోరకుండా చెప్పిన సమయానికి హాజరవుతుంటారు.
జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్ళే ముందు, తిరిగి రాగానే నవంబర్ 14లోగా కోర్టులో స్వయంగా హాజరవుతానని హామీ ఇచ్చారు. కానీ తిరిగి వచ్చి నెలరోజులు పైనే అవుతున్నా హాజరు కాలేదు.
ఎందుకంటే తాను కోర్టుకు వస్తే ప్రభుత్వం భారీగా భద్రత కల్పించాల్సి ఉంటుందట… అది ప్రభుత్వానికి భారంగా మారుతుందనట. కనుక ‘వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి… తప్పనిసరి అయితే వస్తా’ నని జగన్మోహన్ రెడ్డి మరో పిటిషన్ వేశారు.
దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘సరే నవంబర్ 14 అంటే కుదరదు మరో వారం రోజులు సమయం ఇస్తే వస్తారని’ చెప్పడంతో సీబీఐ కోర్టు అంగీకరించి ఈనెల 21 వరకు గడువు ఇచ్చింది.
సినీ, రాజకీయ ప్రముఖులు ఎల్లప్పుడూ అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. కనుక నోటీస్ అందుకోగానే రాలేకపోవచ్చు. కనుక పోలీసులు, కోర్టులు వారి పరిస్థితిని అర్ధం చేసుకొని సమయం ఇస్తూ ఉంటాయి.
కానీ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని తాపీగా ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్న జగన్‌కి గడువు పొడిగింపులు, మినహాయింపులు దేనికి? నవంబర్ 14లోగా హాజరవుతానని హామీ ఇచ్చే యూరప్ పర్యటనకు వెళ్ళి వచ్చారు కదా?
తగినంత సమయం ఇచ్చినా రానప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోగా, ఇలా పిటిషన్లు వేస్తూ కోర్టు సమయం, సీబీఐ న్యాయవాదుల సమయం కూడా వృధా చేస్తున్నారు కదా?అంటే జగన్ సమయం మాత్రమే విలువైనదా?వారి సమయానికి ఎటువంటి విలువా లేదా?అనే సందేహం కలుగుతుంది.
వ్యక్తిగతంగా కోర్టుకి హాజరయ్యే చిన్న విషయాన్ని కూడా ఇంత సాగదీస్తున్నప్పుడు, ఆర్ధిక నేరానికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణ ఇంకెన్ని దశాబ్దాలు లాగిస్తారో?






