వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ లో నిర్వహించిన అద్దంకి నియోజకవర్గ పార్టీ నేతల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్ల సమయంలో ఇప్పటికే రెండేళ్లు పూర్తయిపోయాయి.
ఇంకా మిగిలింది మరో మూడేళ్లే. అందులో ఇక రానున్న ఒకటిన్నర ఏడాది పార్టీ శ్రేణులు కాస్త కళ్ళు మూసుకుంటే మిగిలిన ఆ ఒకటిన్నర ఏడాది లో నేను ఎలాగు పాదయాత్ర చేస్తాను. ఇక నా పాదయాత్రతో ప్రతిరోజు బాబు కి సినిమా చూపిస్తా, అలాగే వారి ప్రభుత్వానికి భయపడాల్సిన పనిలేదు,
బాబుని గట్టిగా నిలదీసే రోజులొచ్చేశాయి అంటూ జగన్ తన పార్టీ శ్రేణులలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పనిలో పనిగా జగన్ 2.0 తో పార్టీ కార్యకర్తలకు మంచి రోజులురాబోతున్నాయి అంటూ పార్టీ క్యాడర్ ని సైతం ఉత్సాహపరిచేలా ప్రసంగించారు.
అయితే జగన్ ప్రసంగాన్ని ఒక్కసారి కక్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇక మిగిలిన మూడేళ్ళలో మరో ఏడాదిన్నర పాటు జగన్ ప్రజలలోకి వెళ్ళరని, ఆ బాధ్యతను పార్టీ నేతలు, కార్యకర్తలే చూసుకోవాలని చెప్పకనే చెప్పేసారు. కేవలం అధికారం కోసమే ఎన్నికలకు సరిగ్గా ఏడాదిన్నర సమయం ఉందనగా జగన్ మరో పాదయాత్రతో ప్రజల వద్దకు వస్తారన్నమాట.
2019 కి ముందు జగన్ చేసిన పాదయాత్ర వైసీపీ కి అధికారాన్ని తెచ్చిపెట్టింది. కానీ రాష్ట్రంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితిలు ఇప్పటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. దానికి తోడు జగన్ ఒక్క ఛాన్స్ పాలన ఎలా ఉంటుందన్న అనుభవం ప్రజలకు కూడా లేదు.
కానీ ఇప్పుడు వైసీపీ ఆ ఒక్క ఛాన్స్ తాలూకా విధ్వంసాన్ని ఏపీతో పాటు దేశం మొత్తానికి చూపించింది. దాని ఫలితమే 151 తో అధికారంలో ఉన్న ఉన్న వైసీపీ 11 కి పతనమయ్యి ప్రతిపక్షానికి కూడా దూరమయ్యింది. అలాగే నాడు టీడీపీ – జనసేన మధ్య రాజకీయ పొత్తు లేదు, ఇక బీజేపీ కూడా అంతర్గతంగా వైసీపీ రాజకీయానికే మద్దతు పలికింది.
ఇక తెలంగాణలో బిఆర్ఎస్ రూపంలో బాబుకి కేసీఆర్ రిటర్న్ గిఫ్టులు జగన్ కు అదనపు బలాన్ని ఇచ్చింది. వీటన్నింటికి తోడు తల్లి విజయలక్ష్మి ఆశీస్సులు, చెల్లి షర్మిల అండదండలు జగన్ కు పుష్కలంగా లభించాయి. అలాగే నాటి పాదయాత్రలు అధికారం వచ్చాకా ఎలా పరదాలుగా మారాయో రాష్ట్రం మొత్తం చూసింది.
ఇలా నాడు వైసీపీ కి రాజకీయ బలంగా మారిన ఈ అంశాలన్నీ కూడా నేడు అదే వైసీపీ కి బందనాలుగా తయారయ్యాయి. ఆ బంధనాలను దాటుకుని, ప్రజలలో తిరిగి విశ్వాసం నింపడానికి, జగన్ 2.0 తో అధికారంలోకి రావడడానికి జగన్ 2019 కి మించి రాజకీయం చేయాలి. అలాగే గతంలో మాదిరి కోడికత్తి ఘటనలు, నారాసుర రక్త చరిత్ర కథనాలు వైసీపీ కి రాజకీయ లబ్దిని చేకూర్చలేవు.
ఇక ఏపీ రాజధాని అమరావతి కూడా వైసీపీ కి ఒక పద్మవ్యూహంగా మారిపోయింది. రాజధానిగా అమరావతిని కాదని ముందుకెళ్లలేని పరిస్థితి, అలా అని గతంలో మాదిరి జై అమరావతి అంటూ మూడు రాజధానుల నుంచి వెనక్కి రాలేని దుస్థితి. ఒక వేళ జగన్ గతంలో మాదిరి అమరావతికి మేము వ్యతిరేకం కాదు అన్నా అందుకు ఏపీ వాసులు జగన్ ను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు.
ఇలా వైసీపీ చుట్టూ జగన్ కూడా చూడలేని ఒక అష్టదిగ్బంధాన్ని జగనే సృష్టించుకున్నారు. ఆ బంధనం నుంచి జగన్ బయటకొచ్చి బాబు కి సినిమా చూపించే సినిమా ఉందా.? అన్నది ఇక్కడ ప్రశ్న.




