జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో 5 ఏళ్ళపాటు డ్రామాలు ఆడిందే తప్ప ఆ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అమరావతిని పాడుబెట్టి టిడిపి నేతలకి ఆర్ధికంగా నష్టం కలిగించి, మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి టిడిపి, జనసేనలకు రాష్ట్రంలో రాజకీయాలు చేయలేని పరిస్థితి కల్పిద్దామనే దురాలోచన కూడా ఉంది. అదే… జగన్ నిజాయితీగా ప్రయత్నించి ఉండి ఉంటే తప్పకుండా ప్రజలు కూడా హర్షించేవారు.
కర్నూలుని న్యాయ రాజధానిగా, విశాఖని కార్యనిర్వాహక రాజధాని చేస్తామని జగన్ చెప్పడం, విశాఖకి మకాం మారుస్తామని చెపుతూ ప్రజలని, పెట్టుబడిదారులను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం పెద్ద రాజకీయ తప్పిదం అని ఎన్నికలలో నిరూపితమైంది.
జగన్ రాజకీయ కోణంలో చేసిన ఈ ప్రయత్నాలను సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిజాయితీగా చేస్తుండటంతో అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజలు కూడా హర్షిస్తున్నారు.
కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు నిన్న ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత ఆ ప్రక్రియని ప్రారంభించారు. ఈ ప్రతిపాదనకు హైకోర్టు ఫుల్ బెంచ్ ఆమోదం తెలిపిన తర్వాత సుప్రీంకోర్టుకి నివేదిస్తారు. సుప్రీంకోర్టు ఆమోదం తెలిపితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుంది.
విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధి చెందుతాయని జగన్, వైసీపి నేతలు వితండవాదం చేస్తూ 5 ఏళ్ళు కాలక్షేపం చేశారే తప్ప ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధికి చేసిందేమీ లేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, భావనపాడు పోర్టులకి రెండోసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
అదేపని అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి ఉండి ఉంటే జగన్ పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడి ఉండేది. కానీ ఎన్నికలకు ముందు చేయడంతో అది ఎన్నికల స్టంట్ అనే అందరూ భావించి వైసీపిని తిరస్కరించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ అంటే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం కాదని, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు రప్పించడమని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపుతున్నారు.
విశాఖ నగరంలో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు, మెట్రో రైల్ ప్రాజెక్ట్, శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు సముద్ర తీరం వెంబడి రోడ్ ప్రాజెక్ట్ వంటి అనేక పనులకు శ్రీకారం చుట్టారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తూనే శ్రీకాకుళం జిల్లాలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకి ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు, జగన్ ఆలోచనా విధానంలో, కార్యాచరణలో ఈ తేడాయే ప్రజలు, పారిశ్రామికవేత్తలు అందరి దృష్టిలో చంద్రబాబు నాయుడుని ఉన్నతంగా ఉంచుతోంది. ఇప్పటికైనా జగన్ ఈవిషయం గ్రహించి తన ధోరణి మార్చుకుంటే మంచిది. లేకుంటే ఆయనతో పాటు నమ్ముకున్న వైసీపి నేతలు, కార్యకర్తలు అందరూ నష్టపోక తప్పదు.




