వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వైసీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కుటుంబ వివాదాలు ఒక్కసారి గమనిస్తే జగన్ ను రాజకీయంగా నిరాయుధుడిగా మారుతున్నారా.? లేదా ఆయనే చేచేతుల నిరాయుధుడిగా మారుతున్నారా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుగా జగన్ రాజకీయంగా నిలదొక్కుకునేందుకు మొదటి అడుగు వేసింది వైఎస్ కుటుంబమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అసలు ఎన్నడూ రాజకీయ వేదికలెక్కని జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల జగన్ కోసం రాజకీయరంగ ప్రవేశం చేసారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర మొదలు వైసీపీ పార్టీ ఏర్పాటు వరకు, అక్రమాస్తుల కేసు పేరుతో జగన్ 16 మాసాలు జైల్లో ఉన్న నాటి నుంచి 2019 ఎన్నికల కురుక్షేత్రం వరకు తండ్రి లేని బిడ్డ ఒక్క అవకాశం అంటూ తల్లి విజయలక్ష్మి,అన్న వదిలిన బాణం అంటూ చెల్లి షర్మిల ఇలా ఇద్దరు ఒక్కటై జగన్ కు కొండంత అండగా నిలిచారు.
షర్మిల తన పాదయాత్ర తో విజయలక్ష్మి తన ప్రచార యాత్ర తో వైసీపీ కి రాజకీయ లబ్ది చేకూర్చారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు వైసీపీ కి మద్దతు పలుకుతూ బిడ్డ కోసం తల్లి అన్న కోసం చెల్లి ఎటువంటి రాజకియ లాభాపేక్ష ఆశించకుండా తమ పరిధికి మించి శ్రమించారు.
కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం, జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తక్షణం తల్లి, చెల్లి ఇద్దరు వైసీపీ కి దూరమయ్యారు, జగన్ కు ప్రత్యర్థులుగా మారారు. దీనితో వైసీపీ కి అత్యంత కీలక రాజకీయ ఆయుధాలుగా ఉన్న విజయలక్ష్మి, షర్మిల జగన్ కు దూరమవ్వడంతో జగన్ తన బలైమన అస్త్రాలను వదులుకున్న వారయ్యారు.
ఇక ఆ తరువాత వైఎస్ కుటుంబం నుంచే మరో వివాదం వైసీపీ ని ముఖ్యంగా జగన్ ను రాజకీయ ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. అదే వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య. గుండె పోటు నుంచి గొడ్డలి వేటు వరకు వైసీపీ నుంచి సాక్షి వరకు చేసిన నారసురా రక్తచరిత్ర రాజకీయం వైసీపీ ని ఇప్పటికి వెంటాడి వేధిస్తూనే ఉంటుంది.
వివేకా మరణం వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారంటూ ఆయనను జగన్ కాపు కాస్తున్నారంటూ వివేకా కుమార్తె చేస్తున్న ఆరోపణలు వైసీపీ ని నైతికంగా బలహీనపరుస్తున్నాయి. 2019 ఎన్నికల ముందు జగన్ చేతిలో అస్త్రంగా ఉన్న సునీత అటు పిమ్మట జగన్ పాలిట ఆయుధంగా మారింది.
ఇలా జగన్ వైఎస్ కుటుంబ సభ్యులతోనే కొరివి పెట్టుకోవడం, వారిని పార్టీకి దూరం చేసుకోవడం వైసీపీ కి ఎంత బలహీనమో అదే విధంగా ప్రత్యర్థి పార్టీలకు అంత బలంగా మారుతుంది. తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల, సోదరి సునీత ఇలా నాడు జగన్ కు రాజకీయ అండగా నిలిచిన సొంత కుటుంబ సభ్యులే నేడు వైసీపీ రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. మరి ఈ పరిస్థితికి కారకులెవరు.?
ఇక ఇదే కోవలో వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు, వైసీపీ నెంబర్ – 2, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి కేవీపీ మాదిరి జగన్ కు విజయసాయి రెడ్డి అన్నట్టుగా వీరిద్దరి మధ్య ఆ స్థాయి తత్సబంధాలు కనిపించేవి. జగన్ కోసం జైలుకైనా సరే అన్నట్టుగా జగన్ అడుగులో అడుగు వేస్తూ జగన్ అక్రమాస్తుల కేసులో A-2 గా జైలుకెళ్లారు సాయి రెడ్డి.
ఇక వైసీపీ ని అధికారంలోకి తేవడానికి, జగన్ ను సీఎం చేసేందుకు ఢిల్లీ కేంద్రంగా సాయిరెడ్డి రాజకీయ చక్రం తిప్పారు. వైసీపీ కోసం ఒక సైనికుడిలా జగన్ కోసం ఒక సేవకుడిలా మారిన సాయిరెడ్డి జగన్ కు ఉన్న అత్యంత కీలకమైన రాజకీయ బలం, బలగం గా ఎదిగారు.
అటువంటి సాయిరెడ్డి కూడా ఇప్పుడు వైసీపీ ని వద్దనుకుని జగన్ ను వదులుకుని కొత్త పార్టీ ఏర్పాటుతో ఏపీలో పొలిటికల్ రీ ఎంట్రీ కి సిద్ధమయ్యారు. నాడు జగన్ కు ఒక రాజకీయ అస్త్రంగా ఉన్న సాయిరెడ్డి ఇప్పుడు అదే జగన్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
సాయిరెడ్డి మాదిరే జగన్ కోసం తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టి మరి రాజధాని అమరావతి మీద నిత్యం విషం చిమ్మిన మాజీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ కృష్ణ రెడ్డి సైతం వైసీపీ కి దూరం జరిగిపోయారు. ఇక వైఎస్ కుటుంబ ఆత్మీయుడిగా పేరుపొందిన బాలినేని కూడా జగన్ వైఖరితో విసిగిపోయి వైసీపీ కి గుడ్ బై చెప్పేసారు.
ఇలా నాడు జగన్ కు అత్యంత దగ్గర ఉన్న, ఆత్మీయులుగా భావించిన సీనియర్ రాజకీయ నాయకుల నుంచి సొంత కుటుంబ సభ్యుల వరకు నేడు జగన్ కు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు.? ఎవరు మార్చారు.? అయితే ఆ అంశాలన్నిటి వెనుక జగన్ స్వయంకృతాపరాధం ఉందా.? లేదా సాయిరెడ్డి చెపుతున్నట్టుగా జగన్ చుట్టూ ఉన్న కోటరీ నే ఇలా జగన్ నుంచి ఒక్కొక్కరిని వేరు చేస్తూ జగన్ ను అటు రాజకీయంగా ఇటు నైతికంగా నిరాయుధుడిగా మారుస్తున్నారా.?







