ప్రజా దర్బార్ అంటే ప్రజల మధ్యకి వెళ్ళాలి కానీ…

YS Jagan during his Pulivendula tour meeting supporters

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు తన పులివెందుల నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఇవాళ్ళ తన నివాసంలో ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజలు, కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటారు. రేపు నియోజకవర్గంలో అరటితోటలను పరిశీలించి అరటి రైతులతో సమావేశమయ్యి వారి సమస్యలు తెలుసుకుంటారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారి అప్పుడే ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలని పట్టుబడుతూ శాసనసభ సమావేశాలకు మొహం చాటేస్తున్న జగన్‌, జనం మధ్యకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. భద్రతా కారణాలని సమాచారం. అదే అయితే బయటకు రాకుండా వచ్చే ఎన్నికలలో వైసీపీని ఎలా గెలిపించుకుంటారో?

ADVERTISEMENT

రాష్ట్రంలో ఎవరైనా పోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాత్రమే తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకువస్తున్నారు. కానీ దానినీ బలప్రదర్శనగా మార్చేసుకొని విమర్శల పాలవుతున్నారు.

ఇప్పుడూ ఆయన ప్రజల వద్దకు వెళ్ళకుండా వారినే తన పులివెందుల ప్యాలస్‌కు రప్పించుకొని కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు.

ఇది రాచరికపోకడే అయినప్పటికీ, ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలస్‌లో ఉండటం కంటే, జిల్లాలకు వెళ్ళి అక్కడ సురక్షితమైన ప్యాలస్‌లో ఇలా ప్రజాదర్భార్ పేరుతో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం మంచిదే.

కానీ అలవాటులో పొరపాటు అన్నట్లుగా పులివెందులలో కూడా బల ప్రదర్శన చేయడం, ఆయన కోసం వేలాదిగా ప్రజలు, అభిమానులు తరలివచ్చారని ఫోటోలు తీయించుకొని సొంత మీడియా, సోషల్ మీడియాలో పెట్టుకోవడం చూసినప్పుడు ఈ పాత డ్రామా అవసరమా?ఇది వాపును బలుపుగా చూపుకోవడమే కదా?అనిపించక మానదు.

అదే… జగన్‌ ఇదివరకులా పాదయాత్ర చేపట్టి ప్రజల మధ్యకు వెళ్ళి అక్కడ ప్రజలతో ఫోటోలు దిగితే లభించే గౌరవం వేరేగా ఉంటుంది కదా? నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేటికీ సిఎం చంద్రబాబు నాయుడు నేరుగా ప్రజల వద్దకే వెళ్ళి వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు కదా?

పులివెందుల పర్యటనలో తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని, వారి ప్రతినిధిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి సమస్యలను పరిష్కరించగలిగితే అందరో హర్షిస్తారు. కానీ అక్కడ కూడా పార్టీ పరిస్థితి, కూటమి పార్టీల బలాబలాలను ఎలా మార్చడం వంటి రాజకీయ చర్చలకే పరిమితమైతే, అదేదో తాడేపల్లి ప్యాలస్‌లోనే కానిచ్చేస్తే సరిపోతుంది కదా?

ADVERTISEMENT
Latest Stories