“కాపుగర్జన” అంటూ ముద్రగడ పద్మనాభం తుని వేదికగా నిర్వహించిన మహాసభ ఎలాంటి విధ్వంసాలకు దారి తీసిందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ విధ్వంసానికి కారణం ఒకరంటే ఒకరంటూ అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకున్నాయి. దీనిపై ఫిర్యాదు చేయడానికి జగన్ బృందం గవర్నర్ నరసింహన్ ను కలిసింది.
“తన ప్రమేయం ఏమి లేకపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా అధికార పార్టీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేసారని, తుని ఘటనతో తనకేమి సంబంధం లేదని, తమను రాజకీయంగా ఎదుర్కొలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిషత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారని, ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు చూస్తున్నారని, వీటిని ఢిల్లీ వర్గాలకు సైతం ఫిర్యాదు చేయడానికి వెళ్తామని” సదరు విషయాలన్నీ గవర్నర్ కు వివరించినట్లుగా జగన్ మీడియాకు తెలిపారు.
అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే… జగన్ చెప్పినవే వాస్తవాలని అనుకున్నా… అధికార పార్టీ ఏ స్థాయిలో అయితే ప్రతిపక్షంపై ఆరోపణలు గుప్పించిందో, అదే స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న జగన్ వర్గం కూడా అధికార పార్టీ వారిపై ఆరోపణలు గుప్పించారు కదా! మరి వారు చేసినవి నిరాధారమైతే, మరి ప్రతిపక్షం వారు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఎందుకు చూపించలేకపొతున్నారు..? అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులకే కాదు, సామాన్య ప్రజల మదిలో కూడా మెదులుతున్నాయి. అంత బాధ్యతగా ఉన్నానని చెప్పుకునే జగన్, మరి ఆ నిరాధార ఆరోపణలు ఎందుకు చేసారో..?



