శంకుస్థాపనలు ఇప్పుడా… నాలుగేళ్ళు ఏం చేశారో?

Jaganచిత్తశుద్ధి ఉన్న ఏ ప్రభుత్వామైనా భారీ ప్రాజెక్టులను అధికారంలోకి రాగానే మొదలుపెడుతుంది. అప్పుడే అవి పూర్తవుతాయి. తెలంగాణలో మరో 4-5 నెలల్లో ఎన్నికలు జరుగబోతుంటే అక్కడి ప్రభుత్వం ఇప్పుడు అనేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్దమవుతోంది.

ADVERTISEMENT

అయితే అది తొమ్మిదిన్నరేళ్ళ క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అభివృద్ధి పనులను ఓ నిరంతర ప్రక్రియగా చేపట్టి ఓ మహాయజ్ఞంలా పూర్తిచేస్తోంది. వాటిని పూర్తిచేస్తూనే మరిన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తోంది కనుక ఎవరూ తప్పు పట్టడంలేదు.

కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా ఒక్క అభివృద్ధిపని కూడా మొదలుపెట్టకుండా, గత ప్రభుత్వం మొదలుపెట్టిన వాటినైనా పూర్తిచేయకుండా అర్ధాంతరంగా వదిలేసింది. ఈ నాలుగేళ్ళలో ఏం చేసిందయ్యా అంటే సంక్షేమ పధకాలు, వాటి కోసం అప్పులు చేస్తుండటం, అన్నిటికీ వైసీపీ రంగులు వేసుకోవడం, వైసీపీ పేర్లు పెట్టుకోవడం, టిడిపి నేతలను వేధించడం, మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రధానంగా కనిపిస్తాయి.

ఈ నాలుగేళ్ళలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వేళ్ళ మీద లెక్కించవచ్చు కానీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినవాటిని, రాకుండా ఆగిపోయినవాటిని లెక్కించడానికి వేళ్ళు సరిపోవు.

ఇంతకాలం అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే అన్నట్లు మాట్లాడిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుంటే ‘అభివృద్ధి’ గురించి మాట్లాడుతోంది. అంటే సంక్షేమ పధకాలు, అభివృద్ధి వేర్వేరని, కేవలం సంక్షేమ పధకాలతోనే ఓట్లు రాలవని ఇప్పటికీ గ్రహించిందా? అంటే రెండోదే అనిపిస్తుంది.

అమరావతిని కాదనుకొన్నప్పుడు మూడు రాజధానులను ఏర్పాటు చేసి చూపించి ఉంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడి ఉండేది. కానీ వైసీపీకే మూడు రాజధానులపై చిత్తశుద్ధిలేదని తెలిసినప్పుడు, ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్న పనులు పూర్తి చేస్తుందని ప్రజలు ఎలా నమ్మగలరు?కనుక ప్రజలను మభ్యపెట్టేందుకే ఇప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తోందని భావిస్తే తప్పుకాదు.

సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలో వెయ్యి కోట్లు విలువైన అభివృద్ధి పనులకు ‘శ్రీకారం చుట్టడానికి’ మంగళవారం నగరానికి వస్తున్నారు. వాటిలో రూ.600 కోట్లు ఓ ప్రైవేట్ సంస్థ (ఇన్‌ఆర్బిట్ మాల్‌)దే. అది కూడా జగన్ ప్రభుత్వం ‘అభివృద్ధి ఖాతా’లోనే రాసేసుకొంటోంది.

ఇదివరకు టిడిపి హయాంలో యూఏఈకి చెందిన లులూ గ్రూప్ విశాఖలో రూ.2,200 కోట్ల పెట్టుబడితో హైపర్ మార్కెట్‌ ఏర్పాటు చేయబోతే వైసీపీ ప్రభుత్వం దానిని తరిమేసి, నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుంటే ఇన్‌ఆర్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేస్తుండటాన్ని ఏమనుకోవాలి?

విశాఖ రాజధానిగా చేయాలనుకొన్నప్పుడు అందుకు తగ్గట్లుగా నగరాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ఈ నాలుగేళ్ళలో చేసింది ఒకే ఒక్క పని. ఋషికొండకు గుండుకొట్టేసి దానిపై విలాసవంతమైన భవనాలు కట్టుకోవడం!

నిన్న జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో రూ.69,100 కోట్లు వ్యయంతో నగరంలోపల, బయట కలిపి కొత్తగా 278 కిమీ పొడవునా మెట్రో కారిడర్స్, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ఆమోదముద్ర వేసింది. కేసీఆర్‌ ప్రభుత్వం కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఇంత భారీ ప్రాజెక్టులను ప్రకటించిందనేది వాస్తవం.

కానీ ఇటువంటి ప్రాజెక్టులని పూర్తిచేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వానికి పూర్తి విశ్వసనీయత ఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తే తప్పకుండా పూర్తిచేస్తుందని ప్రజలు కూడా నమ్ముతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి అటువంటి విశ్వసనీయత ఉందా?

తెలంగాణ ప్రభుత్వం రూ.69,100 కోట్లు ప్రాజెక్టులకు సిద్దమవుతుంటే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.16 కోట్లతో విశాఖలో ప్రధాన కూడళ్ళను విస్తరించడానికి, మరో రూ.11 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి ఇంకా ఇప్పుడు శంకుస్థాపన చేస్తోంది! తెలంగాణ ప్రభుత్వం ఈ 9 ఏళ్ళలో ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 35 ఫ్లైఓవర్లు నిర్మించింది. కానీ ఏపీ ప్రభుత్వం ‘కాబోయే రాజధాని’ విశాఖలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్‌ కూడా నిర్మించలేకపోయింది! ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సామర్ధ్యానికి, పనితీరుకి, చిత్తశుద్ధికి ఇంతకంటే గొప్ప నిదర్శనాలు ఏం కావాలి?

ADVERTISEMENT
Latest Stories