ఎన్నికలు, ప్రచారం, సీట్ల సర్దుబాట్లు, పోల్ మేనేజిమెంట్ వంటి విషయాలలో అధిష్టానం సూచించే నిర్దిష్టమైన వ్యూహాల ప్రకారం ఆయా పార్టీల నాయకులు, శ్రేణులు పనిచేయడం సర్వసాధారణం.
ఒకవేళ అధికార పార్టీలైతే అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల విషయంలో కార్యాచరణ రూపొందించుకుంటే పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఆ ప్రకారమే పనిచేస్తుంటారు.
కానీ రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించడం, దూషించడం కోసం కూడా పార్టీ అధిష్టానం నేతలకు సూచనలు ఇస్తుందా? అంటే అవుననే అనుకోవాలి వైసీపీ నాయకుల మాటలు విన్నప్పుడు!
ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ శత్రువు సిఎం చంద్రబాబు నాయుడుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలన్నా కూడా ఆయనకు ఎవరో కాగితం మీద వ్రాసి ఇవ్వాల్సిందే. అది చూసే తిడుతుంటారు!
అలాగని న్యాయ సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు ఆచితూచి తిడుతున్నారా? అంటే అదీ లేదు. నోటికి వచ్చినట్లు తిడతారు.
ప్రత్యర్ధిని తిట్టాల్సిన తిట్లు కూడా కాగితం మీద వ్రాసుకురావడం చూస్తున్నప్పుడు ఇంత భాషా దారిద్ర్యమా? ఇంత భావదారిద్ర్యమా? అనిపించక మానదు.
సరే! అధినేత జగన్ ‘తెలుగులో కాస్త వీక్’ అని సరిపెట్టుకున్నా అనర్గళంగా బూతులు మాట్లాడగల వైసీపీ నేతలు కూడా అధిష్టానం ఇచ్చిన ఓ లైన్ ప్రకారమే ప్రత్యర్ధులను తిడుతుండటం లేదా విమర్శిస్తుండటం చూస్తున్నప్పుడు నవ్వొస్తుంది.
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన అన్న జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే ఆమెకు అన్నలా భాష, భావ దారిద్ర్యం రెండూ లేవు.
మావిగన్ అంటున్న తన అన్న జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద జోకర్’ అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కనుక ఆమెకు వైసీపీ కౌంటర్ బాకీ పడింది.
తాడేపల్లి ప్యాలస్ నుంచి లైన్ వచ్చినట్లుంది. ముందుగా మాజీ మంత్రి రోజా స్పందిస్తూ, “కూటమి పార్టీలకు దత్త పుత్రికగా మారిన మీకు మా నాయకుడు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా షర్మిలగారూ? కోట్లాది మంది దేవుడిగా పూజించే వైయస్ఆర్ గారిని జీవితాంతం వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది మీరు కాదా? జగన్ గారి పతనం కోసం తపనపడుతున్నది మీరు,” అని ట్వీట్ చేశారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఓ చిలుక జ్యోతిష్యుడు ఫోటోతో మీడియా ముందుకు వచ్చి, “షర్మిలమ్మ ఆ చిలక వంటిది. అప్పుడప్పుడు బోనులో నుంచి బయటకు వచ్చి ఓ కార్డు తీసి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆమె చంద్రబాబు నాయుడు చెప్పమన్న మూడు ముక్కలు మాట్లాడేసి మాయం అయిపోతుంటారు,” అని అన్నారు.
ఆమె గురించి మాట్లాడిన మరికొందరు వైసీపీ నేతలు కూడా ‘చంద్రబాబు నాయుడు ఆమె చేత అలా మాట్లాడించారు,” అన్నారు.
ఆమె “మావిగన్ ఓ వెర్రి ఆలోచన, అలాంటి ఆలోచన చేసి తన అన్న నవ్వులపాలవుతున్నాడు,” అని ఆక్షేపించినప్పుడు ‘కాదు.. మావిగన్ ఓ గొప్ప అద్భుతమైన ఆలోచన’ అని వైసీపీ నేతలు వాదించవచ్చు. కానీ అందరూ కట్టకట్టుకున్నట్లు చంద్రబాబు నాయుడు ఆడించినట్లు షర్మిల ఆడుతున్నారంటూ అసంబద్దంగా మాట్లాడారు.
అంటే చివరికి తమ ప్రత్యర్ధికి కౌంటర్ ఇవ్వాలన్నా తాడేపల్లి ప్యాలస్ నుంచి లైన్ రావాల్సిందేనన్న మాట! ఇదేం దౌర్భాగ్యమో?




