ఇంత కాలం వైసీపి చాలా పటిష్టంగానే ఉండేది. ఆడిందే ఆట… పాడిందే పాట… వేసిందే రంగు… అన్నట్లు సాగిపోతుండేది. చంద్రబాబు నాయుడు అరెస్ట్, దానిపై మోడీ, అమిత్ షాలు మౌనం వహించడం, కోర్టు కేసులు ఎంతకీ తేలకుండా సాగుతుండటంతో టిడిపి పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపి గతంలో కంటే ఇంకా భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు కూడా తేల్చి చెప్పేసాయి.
వైసీపికి ఇంత అనుకూలంగా రాజకీయ వాతావరణం ఉండగా, తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలను చివరికి మంత్రులను కూడా పక్కన పెటేస్తూ లేదా మార్చేస్తూ వైసీపిని చిందరవందర చేసుకొని పార్టీలో అల్లకల్లోలం సృష్టించుకుంటున్నారు.
రాబోయే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ మార్పులు చేర్పులు అని సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు సమర్ధించుకుంటున్నప్పటికీ, వినాశకాలే విపరీత బుద్ధి అని టిడిపి, జనసేనలు అంటున్నాయి. ఆ రెండు పార్టీలు సీట్ల సర్దుబాట్లు చేసుకొని సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ దూసుకుపోతుంటే జగన్ ఏకపక్ష నిర్ణయాలతో వైసీపి అల్లకల్లోల్లంగా మారింది.
‘నా ఫోటో ఒక్కటే చాలు వైసీపిని ఎన్నికలలో గెలిచేందుకు… అంటూ గత నాలుగున్నరేళ్ళుగా ధీమాగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మీ వల్లనే వైసీపి ఓడిపోయే ప్రమాదం ఉంటుందంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలను, మంత్రులను బలిపశువులుగా చేస్తుండటం విశేషం.
తన కారణంగానే ఇప్పుడు వైసీపి మునిగిపోబోతోందని గ్రహించకుండా వారి వల్ల మునిగిపోతుందనుకోవడాన్ని ఏమనుకోవాలి?తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన కేసీఆర్ కూడా ఇదేవిదంగా వ్యవహరించినందుకు చివరికి ఏమయిందో అందరూ చూశారు.
వైసీపిలో అంతర్గతంగా జరుగుతున్న ఈ పరిణామాలతో పాటు బయట వాతావరణం కూడా మారిపోయింది. టిడిపి, జనసేనల పొత్తులు, వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలో ప్రవేశిస్తుండటం వైసీపికి తీరని నష్టం కలిగించే రాజకీయ పరిణామాలు కాగా, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల ఆగ్రహం, వాలంటీర్లు, పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు వైసీపి పాలిట శాపాలుగా మారబోతున్నాయి.




