వైసీపి 6వ జాబితా… మైలవరంలో వసంతం ముగిసింది!

Jagan-YSRCP

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికలలో మళ్ళీ గెలవాలంటే ఏమి చేయాలి? రాష్ట్రాభివృద్ధా… కాదు! సంక్షేమ పధకాలా… కానేకాదు! వాటితో కూడా గట్టెక్కలేమని గ్రహించిన ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను మార్చుకుంటే చాలనే గొప్ప సత్యాన్ని కనుగొన్నారు! దానినే చాలా చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు!

ఈ మార్పులతో రాబోయే ఎన్నికలలో వైసీపి 175/25 సీట్లు గెలుస్తుందో లేదో తెలీదు కానీ ఆయన ఎంతో కష్టపడి నిర్మించుకున్న వైసీపి కంచుకోట ఎన్నికలకు ముందే బీటలు వారుతోంది. ఒక్కో జాబితాలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నారు.

ADVERTISEMENT

శుక్రవారం రాత్రి విడుదల చేసిన 6వ జాబితాలో 6 శాసనసభ, 4 లోక్‌సభ స్థానాలకు ఇన్‌చార్జిలు (అభ్యర్ధులు)ను ఖరారు చేశారు.

ఊహించిన్నట్లే ఈ జాబితాలో మైలవరం వైసీపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ని పక్కన పెట్టేశారు. ఆయన స్థానంలో సర్నాల తిరుపతిరావు యాదవ్‌ని ఇన్‌చార్జిగా నియమించారు. కనుక మైలవరంలో వైసీపికి వసంతం ముగిసిన్నట్లే!

నర్సాపురం వైసీపి ఎంపీ రఘురామ కృష్ణరాజు… వైసీపికి దూరమైనా చివరి వరకు వైసీపిలోనే ఉంటూ, జగన్‌ చేతికి చిక్కనంత దూరంగా ఢిల్లీలో ఉంటూ ‘మా పార్టీ అధినేత జగన్‌…’ అంటూ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ జగన్‌ మీద ‘స్వీట్ రివెంజ్’ తీర్చుకుంటున్నారు. ఆయన స్థానంలో అడ్వకేట్ గూడూరి ఉమాబాలకి జగన్‌ అవకాశం కల్పించారు.

అయితే రామేశ్వరం వెళ్ళినా… అన్నట్లు జగన్‌ రఘురామని వదిలించుకున్నా, ఆయన మాత్రం జగన్‌ను వైసీపిని వదిలేలా లేరు! ఈసారి టిడిపి అభ్యర్ధిగా మళ్ళీ నర్సాపురం నుంచే పోటీ చేయబోతున్నట్లు సమాచారం!

నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌ తమ అధినేత జగన్మోహన్‌ రెడ్డిని అనుకరిస్తూ ప్రసంగిస్తుంటారు కనుక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో కూడా అధినేతే ఆయనకు స్ఫూర్తి! ఇంతకాలం ‘నెల్లూరు సిటీ మాత్రమే కాదు… జిల్లా అంతటిని దంచేస్తా… చించేస్తా… ’ అంటూ ప్రగల్భాలు పలికిన అనిల్ కుమార్‌ యాదవ్, నరసారావుపేటకు జంప్ అయిపోయారు. కనుక ఆయన స్థానంలో నెల్లూరు డెప్యూటీ మేయర్ మహమ్మద్ ఖలీల్‌ పేరుని జగన్‌ ఖరారు చేశారు.

6వ జాబితాలో లోక్‌సభ స్థానాలకు ఇన్‌చార్జిలు:

1. రాజమహేంద్రవరం: డా.గూడూరి శ్రీనివాస్

2. నర్సాపురం: అడ్వకేట్ గూడూరి ఉమాబాల

3. గుంటూరు: ఉమ్మారెడ్డి వెంకట రమణ

4. చిత్తూరు (ఎస్సీ): ఎన్.రెడప్ప.

6వ జాబితాలో శాసనసభ స్థానాలకు ఇన్‌చార్జిలు:

1. నెల్లూరు సిటీ: ఎండీ ఖలీల్ ఖాన్

2. మార్కాపురం: అన్నా రాంబాబు

3. గిద్దలూరు: కె.నాగార్జున రెడ్డి

4. జీడీ నెల్లూరు: కె.నారాయణ స్వామి

5. ఎమ్మిగనూరు: బుట్టా రేణుక

మైలవరం: సర్నాల తిరుపతిరావు యాదవ్.

ADVERTISEMENT
Latest Stories