నేడు జగన్ నర్సీపట్నం పర్యటన విజయవంతం అయ్యిందా లేదా?అంటే అయ్యిందని వైసీపీ, కాలేదని టీడీపి అనుకూల వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఓ పక్క వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా జగన్ కోసం జనం తరలి వచ్చారని వైసీపీ చెప్పుకుంటుంటే, ఎక్కడికక్కడ పేటీఎం బ్యాచ్‌లు ఏర్పాటుచేసుకొని జేజేలు కొట్టించుకున్నారని టీడీపి అనుకూల వర్గం వాదిస్తోంది.
కానీ ఈ పర్యటన దేని కోసం? వైద్య కళాశాల ప్రైవేటీకరణని వ్యతిరేకించడం కోసమే కదా?మరి ఈ బలప్రదర్శన దేనికి? అంటే ఇది ఎంతమాత్రం బల ప్రదర్శన కాదు…. జగన్‌పై అభిమానంతో వచ్చిన ప్రజలను చూసి టీడీపి అసూయతో వక్ర భాష్యాలు చెపుతోందని వైసీపీ సమర్ధించుకుంటోంది.
జగన్ పర్యటనకు బయలుదేరిన ప్రతీసారి సరిగ్గా ఇలాగే జరుగుతుంది. ఇవే ప్రశ్నలు, ఇదే చర్చ వినిపిస్తుంటుంది. కనుక ఈ పర్యటన వలన సదరు ప్రజా సమస్య పరిష్కరించబడిందా?లేదా ప్రభుత్వం వెనక్కు తగ్గిందా?కనీసం ఇటువంటి పర్యటనలతో కూటమి ప్రభుత్వంపై రాజకీయంగా పైచేయి సాధించగలిగారా?
ఇవేవీ సాధించలేకపోయినా ఈ పర్యటనలతో వైసీపీకి కనీసం రాజకీయంగా ఏమైనా మేలు జరుగుతుందా? ఇటువంటి పర్యటనలతో ప్రజలు మెచ్చి, వచ్చే ఎన్నికల వరకు మరిచిపోకుండా గుర్తుపెట్టుకొని వైసీపీని గెలిపిస్తారా? అంటే కాదనే చెప్పుకోవాలి.
కానీ జగన్ పర్యటన విజయవంతమైందని చెప్పుకుంటున్నారు కనుక ‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషంట్ డెడ్’ అనుకోవాలేమో?
ఈ పర్యటనలో మరో ఆసక్తి కరమైన రాజకీయ పరిణామం కూడా జరిగింది. ఇంతకాలం జగన్ పర్యటన అంటే పోలీసులు-వైసీపీ శ్రేణులు, టీడీపి విమర్శలు అన్నట్లు సాగేవి.
కానీ తొలిసారిగా జగన్ రాకని నిరసిస్తూ నర్సీపట్నంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ‘జగన్ గో బ్యాక్’ అంటూ నిరసనలు వ్యక్తం చేశారు. మరోపక్క టీడీపి నేతలు జగన్ ప్రభుత్వ వేధింపులు భరించలేక గుండెపోటుతో మరణించిన డా.సుధాకర్ ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పటు చేసి, అందరినీ ఆలోచింపజేశారు.
ఇంతకాలం జగన్ పర్యటనలు ‘వార్ వన్ సైడ్’ అన్నట్లు సాగుతుండేవి. కానీ తొలిసారిగా టీడీపి కూడా సరైన పద్దతిలో ధీటుగా స్పందించింది. ఇక ముందు కూడా టీడీపి ఈవిదంగానే స్పందించే అవకాశం ఉంది. కనుక జగన్ కూడా ఇక ముందు మరింత జాగ్రత్తగా తన పర్యటనలు ప్లాన్ చేసుకోక తప్పదు. కానీ ఇటువంటి పర్యటనలతో ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? అని ఆలోచించుకోవడం మంచిది.




