
ఏడాదిగా తాడేపల్లి ప్యాలస్‌లో సమావేశాలతో కాలక్షేపం చేస్తున్న జగన్, హటాత్తుగా గేరు మార్చి పరామర్శల పేరుతో కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి సిద్దమవడం విశేషం. మొన్న పొదిలి, నిన్న సత్తెనపల్లి పరామర్శలు ఇందుకు తాజా నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.
Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్ జీర్ణించుకోగలవా?
పరామర్శ పేరుతో బయలుదేరి వేలాదిమంది వైసీపీ శ్రేణులతో బయలుదేరి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నారు. జగన్ పోలీసు అధికారులను బెదిరిస్తుంటే యధారాజా తధాప్రజా అన్నట్లు వైసీపీ శ్రేణులు కూడా రెచ్చిపోతున్నాయి.
“మళ్ళీ మేము అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో గొర్రెలు, మేకలు తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం,” “ఐ యామ్ డిక్లేరింగ్ ది వార్.. జగన్ 2.0,” “అన్న వస్తాడు అంతు చూస్తాడు” అని వ్రాసున్న జగన్ ఫోటోలతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వైసీపీ జెండాలు పట్టుకున్నప్పుడు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లా వ్యవహరించాల్సినవారు రోడ్లపై రౌడీ మూకల్లా వ్యవహరించారు.
Also Read – బీజేపీ వాదానికి మూడు పార్టీల మద్దతు…
కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి జగన్ రూటు మార్చి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని అర్దమవుతూనే ఉంది. ఈ భీభత్సం, బెదిరింపుల ద్వారా సామాన్య ప్రజలనే కాకుండా పోలీస్ వ్యవస్థని కూడా భయపెట్టి నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు.
జగన్ బెదిరింపులు, వైసీపీ శ్రేణుల ఈ భీభత్సం చూసి పోలీస్ అధికారులు వెనకడుగు వేస్తే, ఇదే పద్దతిని రాష్ట్రమంతటా అమలుచేసి క్రమంగా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని దురాలోచన చేస్తున్నట్లనిపిస్తుంది.
Also Read – జగన్ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?
జగన్ సత్తెనపల్లికి వచ్చింది పరామర్శ కోసం. కానీ ఈవిదంగా యుద్ధ ప్రకటనలు చేయడం గమనిస్తే ఆయన భవిష్య కార్యాచరణ ఏవిదంగా ఉండబోతోందో అర్దమవుతోంది.
జగన్ అధికారంలో లేనప్పుడు కూడా వైసీపీ శ్రేణులు ఇంతగా రెచ్చిపోతుంటే, అమరావతిలో, రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారు తప్పకుండా వెనకడుగువేస్తారు.
“ఫ్యాక్షన్ భూతం మళ్ళీ తలెత్తకుండా పాతాళంలోకి తొక్కిపడేశానని పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నానని” సిఎం చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు.
కానీ కాదని జగన్ నిరూపించి చూపుతున్నారు. కనుక పెట్టుబడిదారులు సిఎం చంద్రబాబు నాయుడు మాటలు కూడా నమ్మలేని పరిస్థితిని జగన్ కల్పిస్తున్నారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా రాష్ట్రానికి ఈవిదంగా నష్టం కలిగిస్తూ, ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబు నాయుడుని, పోలీస్ అధికారులను బెదిరిస్తుంటే, వైసీపీ శ్రేణులు ఇటువంటి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ రోడ్లపై వీరంగం ఆడుతూ సామాన్య ప్రజలు తమని చూసి భయాందోళనలకు గురయ్యేలా చేస్తున్నారు.
జగన్ మళ్ళీ ఎన్నటికీ అధికారంలోకి రాలేరని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. కానీ తప్పకుండా వస్తామని, వస్తే ఆయనతో సహా అందరిపై ప్రతీకారం తీర్చుకుంటామని జగన్ & కో ఇలా హెచ్చరిస్తున్నారు. ఏవిదంగా అధికారంలోకి రాగలమనుకుంటున్నారో పొదిలి, రెంటపాళ్ళ రెండు పర్యటనలతోనే తెలియజేశారు కూడా.
జగన్ రెంటపాళ్ళ పర్యటనకు ఒకరోజు ముందు ఎక్స్ సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు ఓ పోస్ట్ పెట్టారు. “రేపు సత్తెనపల్లిలో జగన్ పర్యటించినప్పుడు ఆ ప్రాంతమంతా జగన్ కంట్రోల్లో ఉండబోతోంది,” అని పెట్టారు. అది నిజమే అని నిరూపించి చూపారు కదా?
కనుక జగన్ & కో చేస్తున్న ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం తక్షణం చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.