ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆరాచక పరిస్థితులు నెలకొన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్, వైసీపి నేతల అవహేళనలను, అవమానాలను భరిస్తూ ధీటుగా ఎదుర్కొన్నారు. ఈసారి మరింత రాజకీయ పరిణతి ప్రదర్శిస్తూ తాను గెలిచి తన పార్టీని కూడా గెలిపించుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి, కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమలో వారికి కూడా చాలా సంతోషం కలిగించింది.
రాజకీయాలలో నిలద్రొక్కుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు ధరించి సనాతన మార్గంలో పయనిస్తారేమోనని ఆయన అభిమానులు ఆందోళన చెంది ఉంటారు. అలాగే తమిళనాడు రాజకీయాలలో వేలుపెడుతుండటం జనసేన నేతలను ఆందోళనకి గురిచేసి ఉండొచ్చు.
కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ యధాప్రకారం తన మంత్రిత్వ బాధ్యతలు, పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే కాస్త సమయం చూసుకొని హరిహర వీరమల్లు, దాని తర్వాత ఓజీ సినిమాలు పూర్తిచేయబోతుండటం పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా సంతోషం కలిగించే విషయమే.
అయితే వీటితో పాటు జనసేన పార్టీని రాజకీయంగా బలోపేతం చేసుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ మెల్లగా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇప్పటికే వైసీపి నుంచి సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య తదితరులు జనసేన పార్టీలో చేరారు.
తాజాగా ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమార్తె ముద్రగడ క్రాంతి, కల్వకొలను తాతాజీ గుంటూరు కార్పొరేటర్లు అయిశెట్టి కనకదుర్గ, నిమ్మల వెంకటరమణ, ఇర్రి ధనలక్ష్మి, సంకూరి శ్రీనివాసరావులకు పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
జగ్గయ్యపేటలో వైసీపికి చెందిన పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. కనుక పవన్ కళ్యాణ్ మంత్రిత్వ బాధ్యతలు, సినిమాలు, పార్టీ కార్యక్రమాలు బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగబోతున్నట్లే ఉన్నారు. ఇది చాలా అవసరం కూడా.




