జనసేన ఎమ్మెల్యేల పనితీరు ఓకేనా?

Janasena MLAs Under Fire Over Poor Performance

సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రతీ రాజకీయ పార్టీలో టికెట్ కోసం కనీసం ముగ్గురు కొన్ని సందర్భాలలో అంతకు మించి ఆశవాహులు పోటీ పడుతుంటారు. కనుక టికెట్ దక్కించుకోవడానికే చాలా శ్రమించాల్సి ఉంటుంది.

ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు, టికెట్ దక్కగానే గెలిచినట్లు కాదు. కనుక మళ్ళీ గెలుపు కోసం అంతకు పదిరెట్లు శ్రమించాలి. డబ్బుని మంచినీళ్ళ ఖర్చుపెట్టాలి. అయినా గెలుస్తామనే గ్యారెంటీ ఉండదు.

ADVERTISEMENT

కనుక ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేందుకు అభ్యర్ధులు ఎంతగా శ్రమిస్తారో, ఎమ్మెల్యేలు అయ్యేందుకు మన రాజకీయనాయకులు అంత కంటే ఎక్కువే శ్రమిస్తారు. కనుక ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి పదవి లభించడం ఆషామాషీ కాదని స్పష్టమవుతోంది.

కానీ జనసేన ఎమ్మెల్యేలలో ఎంతమందికి తమ పదవుల విలువ తెలుసు? ఎంత మంది తమ అధినేత పవన్ కళ్యాణ్‌లా కష్టపడి పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు? ఎంతమంది ప్రజలతో మమేకం అవుతున్నారు? ఎంతమంది ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు? అని ప్రశ్నించుకుంటే సమాధానం సంతృప్తికరంగా ఉండదు.

పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు పార్టీలో పలువురు సీనియర్లను పక్కన పెట్టాల్సివచ్చింది. అందుకు వారు బాధపడినా పరిస్థితి అర్థం చేసుకొని పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు.

కానీ వారి త్యాగాలతో ఎమ్మెల్యేలైన జనసేన నేతలు ఏం చేస్తున్నారు? కొంతమంది మహిళలతో రాసలీలలు చేస్తుంటే, కొంతమంది తమ నియోజకవర్గంలో చెలరేగిపోతూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు.

మంత్రి నిమ్మల రామానాయుడు నేటికీ పసుపు చొక్కా ధరిస్తూ టీడీపి పట్ల తన అభిమానాన్ని చాటుకుంటారు. మంత్రిననే అహంభావం చూపకుండా నిత్యం ప్రజలతో కలిసి మెలిసి ఉంటారు. కీలకమైన సాగునీటి శాఖ బాధ్యత అప్పజేప్పడంతో నిత్యం ప్రాజెక్టులను సందర్శిస్తూ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుంటారు.

ఆయనతో పోలిస్తే జనసేన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కనీసం జనసేన పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా శ్రద్ధ చూపకపోవడంతో ఆ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది.

జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగు పరుచుకోకపోతే సిఎం చంద్రబాబు నాయుడు టీడీపి మంత్రులు, ఎమ్మెల్యేలనే ఉపేక్షించరు.

ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల ప్రభావంతో, జగన్‌ పట్ల వ్యతిరేకత వలన జనసేన అభ్యర్ధులు అందరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

కానీ వచ్చే ఎన్నికలు మరింత భీకరంగా సాగుతాయి. అప్పుడు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత బలం, ఇమేజ్‌తోనే గెలవాల్సి ఉంటుంది. మరి తమకు అలాంటి క్లీన్ ఇమేజ్, ప్రజాధరణ, పార్టీ బలం ఉందా లేదా? అని ఎవరికి వారు ఆలోచించుకుంటే మంచిది.

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు. కనుక పవన్ కళ్యాణ్‌ కూడా జనసేన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలిపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు అందరినీ గాడిన పెట్టుకోవడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories