ఒక మనిషి మీద పెట్టుకున్న అభిమానం ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలుగు నాట వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో తెలిసివచ్చింది. జగన్ చెప్పిన సంఖ్యలలో తేడా ఉండవచ్చు గానీ, ఎంతో కొంతమంది వైఎస్ మరణ వార్త విని కాలం చేశారన్నది అంగీకరించాల్సిన సత్యం. అయితే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అనేక అనుమానాలు నెలకొన్న నేపధ్యంలో… వ్యక్తమైన పుకార్లకు ఒక వ్యక్తి బలయ్యాడు.
[m9ad]
‘పురచ్చితలైవి’ ఆరోగ్యంపై మీడియాలో ప్రసారమవుతున్న వార్తలతో కలత చెందిన 47 ఏళ్ళ ముత్తుస్వామి అనే కార్యకర్త గుండెపోటుకు గురై మరణించాడు. కోయంబత్తూరులోని విమానాశ్రయం సమీపంలో ముత్తుస్వామికి జయలలిత అంటే అంతులేని అభిమానం. సెప్టెంబరు 22న అనారోగ్య కారణాలతో జయలలిత ఆసుపత్రిలో చేరిన తరువాత, ముత్తుస్వామి ఇంట్లోను, స్నేహితుల వద్ద రోజూ ఇదే విషయాన్ని చర్చిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
దీంతో ముత్తుస్వామి ధైర్యం చెప్పే పనిలో… అమ్మ క్షేమంగా ఉంటారని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని భరోసా ఇచ్చేవారు. కానీ, ఇటీవల గవర్నర్ రావడం, పలువురు కేబినెట్ మంత్రులు జయలలితను పరామర్శించేందుకు వెళ్లడం, ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పుకార్లు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ముత్తుస్వామి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వేగంగా స్పందించి, అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ముత్తుస్వామి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ పరిణామంతో జయలలిత అకౌంట్ లో ఓ అభిమాన మరణం నమోదైంది.



