గత 40 రోజులుగా చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి అసలు అనారోగ్యానికి గల కారణాలు ఏంటి? అంటే ఖచ్చితంగా ‘ఇది’ అని ఏ ఒక్కరూ చెప్పలేని పరిస్థితి. అపోలో చికిత్స అందిస్తున్నారు అని చెప్తున్నారు గానీ, అసలు ఏమైంది? దేనికి చికిత్స అందిస్తున్నారు? అనేది బయటకు వెల్లడి కాని విషయం. ఇదంతా ప్రజల్లో పలు అనుమానాలకు దారి తీస్తున్న సమయంలో ఇటీవలే జయలలిత మాట్లాడుతోందని సమాచారాన్ని పార్టీ వర్గాలు లీక్ చేసారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు జయలలితకు సంబంధించిన వీడియో గానీ, ఫోటో గానీ బహిరంగపరచలేదు.
ఈ పరిణామాలన్నీ ఒకెత్తు అయితే, తాజాగా లండన్ నుండి వెలువడే డైలీ మెయిల్ అనే దినపత్రిక ఒక సంచలనమైన కధనాన్ని ప్రచురించింది. “తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై చేతబడి జరిగిందని, అందువలనే ఉన్నట్లుండి ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారని, కొన్ని లక్షల రూపాయలు ఈ చేతబడి కోసం ఖర్చు చేసారని, తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు ఈ విషయాన్ని తెలిపినట్లుగా ప్రచురించిన ఆ కధనం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రత్యర్ధి పార్టీ అయిన డిఎంకేలోని వారు గానీ, అలాగే జయ అంటే గిట్టని సొంత పార్టీ వారు గానీ ఈ చేతబడి చేయించినట్లుగా సదరు కధనంలో పేర్కొన్నారు.
ఒక్క జయలలిత ఆరోగ్యమే కాదు, ఇటీవలే అనారోగ్యం బాట పట్టిన కరుణానిధి కూడా తాంత్రిక శక్తులే కారణమని పేర్కొనడం మరింత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. అసలే ‘అమ్మ’కు ఏం జరిగిందో తెలియక మల్లగుల్లాలు పడుతున్న అభిమానులకు, ప్రజలకు ఈ కధనం మరింత మనోవేదనను మిగులుస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పారని ప్రసారం చేసిన ఈ కధనంలో ఆ జ్యోతిష్కుని పేరు ఎందుకు బయటకు రాయలేదు? నిజంగా అలా చెప్పి ఉంటే స్థానిక మీడియాను వదిలిపెట్టి ఒక అంతర్జాతీయ మీడియాకు ఎందుకు వెల్లడించినట్లు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే అయినప్పటికీ, తాజాగా వెలువడిన ఈ కధనం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.



