సుదీర్ఘ వెతుకులాట అనంతరం శోభన్ బాబు – జయలలితల నకిలీ కొడుకు అరెస్టయ్యాడు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత – సినీ హీరో శోభన్ బాబులకు తాను జన్మించానని చెప్తూ… కృష్ణమూర్తి అనే 28 ఏళ్ళ వ్యక్తి మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాను జయలలిత కుమారుడినని, శశికళ నుంచి ప్రాణహాని ఉందని, జయలలితకు సంబంధించిన ఆస్తులన్నీ తనకు అప్పగించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం, పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అతని పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, కోర్టుకు సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని గుర్తించింది. దీంతో కృష్ణమూర్తిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పరారీలో ఉన్న కృష్ణమూర్తి కోసం వేట సాగించగా, తాజాగా దిండిగల్ బస్టాండ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల అనంతరం కొన్ని రోజులు ఇద్దరు లాయర్ల వద్ద ఆశ్రయం పొందానని, ఆ తరువాత రాష్ట్రం మొత్తం ఆర్టీసీ బస్సుల్లో తిరిగానని, అలా తిరిగే క్రమంలోనే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు.
విచారణ అనంతరం న్యాయస్థానంలో హాజరు పరుస్తామని పోలీసులు తెలపడంతో, జయలలిత – శోభన్ బాబుల కొడుకు మిస్టరీ వీడినట్లయ్యింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ వారసులు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నందున, వాటిని కట్టడి చేసేందుకు, నిందితులకు రైట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ‘అమ్మ’ అభిమానులు కోరుతున్నారు. ఇలా ఫేక్ కొడుకులు పుట్టుకొచ్చే ప్రతిసారి, శోభన్ బాబు – జయలలితల సంబంధం హైలైట్ అవుతూ వస్తుండడం అభిమానులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది.



