
జగన్ అధికారంలో ఉన్నప్పుడు 175కి 175 సీట్లు మనమే గెలుచుకొని మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని పార్టీలో అందరినీ నమ్మించేవారు. కానీ ఆయన మాటలను ఎవరూ నమ్మలేదని పార్టీని వీడి బయటకు వచ్చిన రాపాక వరప్రసాద రావు చెప్పేశారు. తాము జగన్ మాటకు ఎదురుచెప్పలేక ఆయనకు తాళం వేసేవారిమని లేకుంటే పార్టీలో ఒక్క క్షణం కూడా ఉండనీయరని రాపాక చెప్పారు.
అధికారంలో ఉన్నప్పుడు 175 పేరుతో భ్రమింపజేయడానికి ప్రయత్నించిన జగన్, ఎన్నికలలో దారుణంగా ఓడిపోయయాక ఇప్పుడు కూడా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు చేజారి పోకుండా కాపాడుకునేందుకే జగన్ ఆవిదంగా చెపుతున్నారని అర్దమవుతూనే ఉంది.
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
కానీ ఒకసారి ఆయన మాయమాటలు నమ్మి మోసపోయి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లని నోటికి వచ్చిన్నట్లు తిట్టి పోసి సమస్యలలో చిక్కుకున్న వైసీపీ నేతలు ఎవరూ మళ్ళీ జగన్ చెపుతున్న ఈ కొత్త స్టోరీని పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలువురు పార్టీని వీడగా, ఇంకా అనేక మంది బయటకు వచ్చేందుకు దారి కనిపించక ఇంకా వైసీపీలోనే ఉన్నారు.
రాపాక వరప్రసాద రావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే కైకలూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా లేఖను జగన్, ఎమ్మెల్సీ పదవి రాజీనామా లేఖను మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ఈరోజు ఉదయమే పంపించారు.
Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జగన్ నా సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని, ఓట్ల లెక్కలు చూసుకొని నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు తప్ప ఏనాడూ నాకు పార్టీలో, ప్రభుత్వంలో గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం నన్ను కలిసేందుకు కూడా జగన్ ఇష్టపడేవారు కారు. అదే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా వెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడగలిగే వాడిని. తగిన గౌరవం, గుర్తింపు లేని పార్టీలో ఉండటం కంటే రాజీనామా చేసి బయటకు వచ్చేయడమే మంచిదని భావించాను,” అని అన్నారు.
జయమంగళ వెంకట రమణ వైసీపీకి మంగళ హారతి పాడేసి మళ్ళీ టీడీపి గూటికి చేరుకోవాలని కోరుకుంటున్నారు.. అని అర్దమవుతూనే ఉంది. బహుశః చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఉంటారు. అందుకే ఆయన సూచన మేరకు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఉండొచ్చు. ఇప్పటికే సుంకర పద్మశ్రీ, పొత్తుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసి ఆమోదించాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు జయమంగళ కూడా కోరుతున్నారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికలలో వైసీపీ మళ్ళీ గెలవడం మాట దేవుడెరుగు.. పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోకుండా అదే పదివేలు!