వైసీపీ నుండి ఈ నెల 11వ తేదీన తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్న జ్యోతుల నెహ్రూ మొదటిసారిగా తన ‘గళం’ విప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరిణతి కలిగిన ‘ఫక్తు’ రాజకీయ నాయకుడని, వైఎస్సార్సీపీ అధినేత పరిపక్వత లేని ‘రేర్’ పొలిటీషియన్ అని, వైఎస్సార్సీపీలో నాయకత్వ లోపం ఉందని జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు.
జగన్ తన చుట్టూ ఉన్నవారిని నమ్మడని, తాను సరైన దారిలోనే వెళ్తున్నాను… తనను ప్రజలు ఎందుకు నమ్మట్లేదు? అని జగన్ ఆలోచించుకుంటుంటే… ఎన్ని కష్టనష్టాలు ఎదురవుతున్నా జగన్ వెంట నడుస్తున్న తమ లాంటి నేతలను జగన్ ఎందుకు విశ్వసించడం లేదని పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారని పార్టీలోని నేతల అంతర్గత విషయాలు బయటపెట్టారు. ప్రత్యర్థి పార్టీ వర్గాలు ఎన్ని విమర్శలు చేసినా నవ్వుతూ స్వీకరించే జగన్, సొంత నేతలు ఏదైనా అంటే ఏ మాత్రం జీర్ణించుకోలేరని జగన్ తీరును ఎండగట్టారు.
పార్టీ మారినంత మాత్రాన చంద్రబాబు గొప్పగా పాలించేస్తున్నారని చెప్పనని, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను పరిశీలిస్తే, చంద్రబాబు పాలన అద్భుతంగా ఉందని చెప్పడంలో సందేహించాల్సిన అవసరం లేదని అన్నారు. పీఆర్పీ పెట్టిన సమయంలో చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని భావించానని, తనది అవకాశవాద రాజకీయం కాదని, ఆశావాద రాజకీయమని, గతంలో యనమలతో రాజకీయ విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా, యనమల ఆహ్వానం వల్లే తాను టీడీపీలో చేరానని స్పష్టం చేసారు.
తాను నీతిమంతుడైన నాయకుడినని గొప్పగా చెప్పుకోనని, అయితే స్వప్రయోజనాల కోసం కాకున్నా, తనపై నమ్మకంతో నిలబడ్డ వారి కోసమైనా తప్పులు కొన్ని చేసి ఉంటానని, బీసీలకు అన్యాయం చేయని విధంగా కాపులకు న్యాయం చేస్తానని చంద్రబాబు తనతో చెప్పారని జ్యోతుల తెలిపారు.



