వెస్ట్ బెంగాల్ లో బీజేపీ జయకేతనం తరువాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ ప్రధాని మోడీ ప్రకటించడంతో తెలంగాణలోనే కాంగ్రెస్, బిఆర్ఎస్ లతో పాటుగా బీజేపీ కూడా ఎలర్ట్ అయ్యింది.
మోడీ టార్గెట్ ను అందుకోవడంతో టి. బీజేపీ నేతలు తమ వ్యక్తిగత అహాలను పక్కన పెట్టి పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు సన్నద్ధం కావాలంటూ బీజేపీ అధిష్టానం నుంచి టి. బీజేపీ నేతకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు వార్తలు వినిపించాయి.
అయితే వాటిని నిజం చేసేలా నేడు టి. బీజేపీ లో ఉప్పు – నిప్పు మాదిరి రెండు భిన్న ధ్రువాలుగా కనిపించే బండి సంజయ్ – ఈటెల రాజేంద్ర ప్రసాద్ చేతులు కలిపారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ సమక్షంలో ఈ ఇద్దరు నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఒకరిని మరొకరు ఆలింగనం చేసుకున్నారు.
బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకమయ్యారు. టి. బీజేపీ లో కనిపిస్తున్న ఈ కీలక పరిణామం ఆ పార్టీ క్యాడర్ లో మంచి జోషుని నింపనుంది. ఇన్నాళ్ళుగా బిఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వచ్చిన నేతగా ఈటెల, బండి నుంచి ఆధిపత్య పోరును ఎదుర్కొన్నారు.
బండి, ఈటెల ఇద్దరు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పరోక్షంగా విమర్శలు, కౌంటర్ లు వేసుకుంటూ టి. బీజేపీ లో అంతర్గత పోరుకి బాటలు వేశారు. దీనితో టి. బీజేపీ లో వర్గ పోరు పెరిగిపోయిందని, ఈ కారణంగానే తెలంగాణ లో బీజేపీ రాజకీయంగా ఎదగలేకపోతుంది అనే ఆరోపణలు బలంగా వినిపించాయి.
కానీ నేడు బండి – ఈటెల కలయిక తెలంగాణలో బీజేపీ రాజకీయ ఎదుగుదలకు ఒక మంచి కీలక పరిణామంగా పరిగణించవచ్చు. ఈటెల కు తెలంగాణ రాజకీయాల మీద ఉన్న పట్టు, బండి కి బీజేపీ లో ఉన్న మెప్పు, ఈటెలకు ఉన్న క్షేత్ర స్థాయి బలం, బండి కున్న జాతీయ స్థాయి గుర్తింపు తో ఈ ఇద్దరు ఒక్కటిగా కలిసి ముందుకెళ్లగలిగితే మోడీ నెక్స్ట్ టార్గెట్ కు మార్గం సులభమయినట్టే అంటున్నారు బీజేపీ శ్రేణులు.




