మరికొద్ది గంటల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ సిల్వర్ స్క్రీన్ పై “కబాలి” రూపంలో దండయాత్ర చేస్తాడనుకున్న తరుణంలో కోర్టు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్ ను ఇప్పటికే ఓ సారి మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అదే కోర్టులో బుధవారం నాడు మరో పిటిషన్ దాఖలు కావడం, దానిని కోర్టు స్వీకరించడం, అభిమానులకు ఆందోళనకు గురిచేసే అంశంగా మారింది.
రజనీకాంత్ గతంలో నటించిన చిత్రం ‘లింగా’ పంపిణీదారులు వేసిన ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. రేపు విడుదల కానున్న నేపథ్యంలో నేటి కోర్టు విచారణ జరుగుతుండటంపై రజనీ అభిమానులతో పాటు కోలీవుడ్ సినీ వర్గాలు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ‘లింగా’ చిత్రం నష్టాలను పూడ్చేస్తామంటూ హామీ ఇచ్చిన రజనీ, చిత్ర నిర్మాత కలైపులి థాను… తమ హామీని నిలబెట్టుకోలేదని, ఈ కారణంగా ‘కబాలి’ విడుదలను ఆపేయాలని పంపిణీదారులు తమ పిటిషన్ లో కోర్టును కోరారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు, హీరో రజనీకాంత్ సహా కలైపులి థానులకు నోటీసులు జారీ చేసింది. ‘లింగా’ పంపిణీదారుల వాదనకు కోర్టు సానుకూలంగా స్పందిస్తే ‘కబాలి’ పరిస్థితి ఏమిటా అన్న ఆలోచన సూపర్ స్టార్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు ఇప్పటికే ‘కబాలి’ విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆయా థియేటర్లలో చాలా షోలకు సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడుబోయాయి. దీంతో కోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.



